● అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు రైతుల వినతి
గట్టు : ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూములను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రాయాపురం రైతులు తెలిపారు. ఈ మేరకు గురువారం గద్వాలలో అదనపు కలెక్టర్ మదుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావును కలసి వినతిపత్రం అందజేశారు. బుధవారం గిర్దారర్, జీపీఓలు రాయాపురం గ్రామానికి చేరుకుని సర్వే నెంబర్ 83లో గట్టు నుంచి గద్వాలకు వెళ్లే మార్గంలో దేవరగట్టు దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్న 50 ఎకరాలకు సంబంధించిన భూములను పరిశీలించినట్లు రైతులు తెలిపారు. 60 ఏళ్లుగా ఈ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అగ్రికలర్చ్ రీసెర్చ్ సెంటర్ కోసమంటూ భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు వాపోయారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తమ భూములను లాక్కొని రోడ్డున పడేయొద్దని అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు విన్నంచారు. కార్యక్రమంలో రైతులు సాలెకర్రెప్ప, నర్సింహులు, పరుశరాముడు, గొవిందు, పాగుంటప్ప, తిమ్మప్ప,మారెప్ప, వీరేష్, బస్వరాజు పాల్గొన్నారు.


