విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా? | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా?

Sep 18 2026 1:33 AM | Updated on Sep 18 2026 1:33 AM

పాలమూరు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గణనాథుల నిమజ్జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న నిమజ్జనానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ చుట్టుపక్కల చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో భారీ విగ్రహాల నిమజ్జనంపై ఆందోళన నెలకొంది. దీంతో కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో చిన్న విగ్రహాల కోసం కృత్రిమ చెరువులు (బేబీ పాండ్స్‌) ఏర్పాటు చేస్తున్నారు. పదేళ్ల కిందట ఇదే తరహాలో ఎదురైన సమస్య మళ్లీ తలెత్తింది.

1,945 విగ్రహాలకు అధికారిక అనుమతులు

జిల్లాలోని 16 పోలీస్‌స్టేషన్ల పరిధిలో గణనాథుల ఏర్పాటుకు 2,067 దరఖాస్తులు రాగా.. 1,945 విగ్రహాలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. మరోవైపు అనుమతులు అవసరం లేని మూడు అడుగుల లోపు విగ్రహాలు సుమారు 15 వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటన్నింటికీ నిమజ్జనానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్‌, హన్వాడ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి నీటి లభ్యత కొంత మెరుగ్గా ఉండగా.. మహబూబ్‌నగర్‌ నగరంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాల నిమజ్జనమే ప్రధాన సమస్యగా మారనుంది.

బీచుపల్లికి బదులు స్థానికంగా..

మహబూబ్‌నగర్‌ నగరంలోని భారీ గణనాథులను ప్రతిసారీ బీచుపల్లికి తరలించి నిమజ్జనం చేసేవారు. అయితే ఈసారి కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో స్థానికంగా ఉన్న చెరువుల్లోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హన్వాడ, పెద్దదర్పల్లి చెరువుల్లో కొంత నీరు ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస కాలనీ, పాలకొండ చెరువుల్లోనూ నీరు అందుబాటులో ఉండటంతో కొన్ని విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవరకద్రలోని పెద్ద చెరువులోనూ నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. జడ్చర్లలో దుందుబీ వాగు పరిధిలోని క్వారీల్లో నిలిచిన నీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

బేబీ పాండ్స్‌ ఏర్పాటు

చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూ ర్‌ మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.5 లక్షలతో బేబీ పాండ్‌ నిర్మించారు. 38 అడుగు ల పొడవు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఇందులో సుమారు లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయనున్నారు. మూడు అడుగుల లోపు విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేయనున్నారు.

● అప్పన్నపల్లి శివారులోని గంగోస్‌కుంట ఆవరణలో మరో రెండు బేబీ పాండ్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.8.50 లక్షలతో ఒక్కొక్కటి 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సుమారు రెండు లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు అడుగుల లోపు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు.

● జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఒకటి, హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒకటి, బీసీ వసతిగృహం సమీపంలో మరొకటి బేబీ పాండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. – దేవరకద్ర మున్సిపాలిటీలో స్టేషన్‌ రోడ్‌లోని చర్చి సమీపంలో, భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌ తండాలోనూ ఒక బేబీ పాండ్‌ నిర్మిస్తున్నారు.

జూరాల నుంచి

నీరు విడుదల చేయాలి

భారీ విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. నిమజ్జనానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నీటి లభ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది.

కృత్రిమ కుంటల్లోనే వినాయక నిమజ్జనం: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమకు సమీపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ బేబీ కుంటలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సూచించారు. చిన్న, మధ్య తరహా విగ్రహాలను ఆయా కుంటల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు చెరువులు, కుంటలు ఎండిపోవడంతో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్‌ మున్సిపాలిటీల పరిధిలో కృత్రిమ కుంటలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ వీటిని వినియోగించుకోవాలని, తద్వారా నీటి కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్‌ కోరారు.

23న జిల్లాలో గణపతి నిమజ్జనం

మహబూబ్‌నగర్‌ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఎండిపోవడంతో ఇబ్బందులు

కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులు

5 అడుగుల లోపు విగ్రహాలకు స్థానికంగానే నిమజ్జన ఏర్పాట్లు

జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement