మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న పీఎంశ్రీ నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించి, నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, విద్యా సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రశస్త్‌కు సంబంధించిన వీడియోలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరూ వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్వచ్ఛ విద్యాలయ రేటింగ్స్ వివరాలను యాప్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్ సీడింగ్ పూర్తితో పాటు అపార్ ఐడీలను జనరేట్ చేయాలన్నారు. ప్రతి పాఠశాలను డ్రగ్ ఫ్రీ క్యాంపస్‌గా ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు.


