జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీల ఆవాస ప్రాంతాల్లో వారి సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతర్ కుల వివాహ ప్రోత్సాహకం, భూమి కొనుగోలు తదితర పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అర్హులకు అవగాహన కల్పించాలన్నారు. మూఢనమ్మకాలను వీడి విద్య, ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి అనుసూచిత్ అభ్యుదయ యోజన కింద భూమి పొందిన లబ్ధిదారులకు బోర్లు, పంపుసెట్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నిర్వహించి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మెప్మా, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులకు అమలవుతున్న బీమా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.పెండింగ్ అంశాలపై నివేదికలు పంపితే సెప్టెంబర్ 22న సీఎంతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, డీఆర్వో నిర్మల, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సునీత, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించొద్దు
సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
రోస్టర్, రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


