నవాబుపేట: గ్రామంలో మద్యం తాగి నిత్యం కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్న ఘటలు పెరుగుతూ వచ్చాయి. దీంతో మద్యం మానేసేలా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్న మండలంలోని యన్మన్‌గండ్ల గ్రామం ఏకంగా పంచాయతీలోనే తీర్మానం పెట్టింది. తమ గ్రామంలో ఇక నుంచి మద్యం విక్రయించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే జైలుకు పంపిస్తామంటూ హెచ్చరిక జారీ చేసింది పంచాయతీ పాలకవర్గం. గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే ఆ సమాచారం చెప్పిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులతో అవగాహన కల్పించారు. గ్రామంలో ఇప్పటి వరకు మద్యం విక్రయించిన బెల్టు దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్యం విక్రయించం అంటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో వారిని పంచాయతీ ద్వారా సన్మానించి, అభినందించారు. యన్మన్‌గండ్ల గ్రామంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని అధికారులు సూచిస్తున్నారు.
గ్రామం: యన్మన్‌గండ్ల
ఓటర్లు: 2,895
జనాభా: 6,862
యన్మన్‌గండ్లలో మద్యపాన నిషేధానికి తీర్మానం
తీర్మానం అతిక్రమిస్తే కఠిన చర్యలు
మద్యం ఆచూకీ చెప్పిన వారికి రూ.2 వేల నగదు


