మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎదిర శివారులోని ఊరచెరువు కట్టపై ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ ఎదిర’ లోగోను ఆవిష్కరించి చుట్టుపక్కల మొక్కలు నాటారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాలాచోట్ల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నందున మొక్కలు విరివిగా నాటడం అత్యవసరమని పేర్కొన్నారు. నీటి సమస్యలను అధిగమించడానికి, భూగర్భజలాల సంరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తున్నామని, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులకు శిక్షణ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎదిర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అంతకుముందు లక్ష్మీనగర్‌కాలనీ వద్ద మెయిన్ రోడ్డు పక్కన నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ఆర్చ్‌ను ప్రారంభించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పాఠశాల హెచ్‌ఎం హేమచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


