నులి పురుగులు
రాకూడదంటే..
వ్యాధి లక్షణాలు ఇలా..
● నివారణే లక్ష్యంగా 19 ఏళ్ల వారికి
ఆల్బెండజోల్ మాత్రలు
● నేడు జిల్లావ్యాప్తంగా పంపిణీకి చర్యలు
● నివారణే లక్ష్యంగా 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు
● నేడు జిల్లావ్యాప్తంగా పంపిణీకి చర్యలు
పాలమూరు: కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర సమస్యలు ఎదురవుతాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పేగుల్లో ఉండే పరాన్నజీవి మనం తీసుకునే ఆహారాన్ని గ్రహించి రక్తహీనత, పోషకలేమి సమస్యలను సృష్టిస్తుంది. అపరిశుభ్రత కారణంగా చిన్నారుల్లో నులి పురుగులు వ్యాప్తి చెంది రోగాలబారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. సోమవారం నులిపురుగుల నివారణ దినం వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలోని 1నుంచి 19 ఏళ్లలోపు చిన్నారులు, యువతీ, యువకులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. మాప్ ఆఫ్ కింద ఈ నెల 20న కూడా మాత్రలు పంపిణీ చేయనున్నారు.
సిబ్బందికి శిక్షణ..
నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీకి ఇప్పటికే వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాకు వచ్చిన 2,57,800 ఆల్బెండజోల్ మాత్రలను 129 సబ్‌సెంటర్లు, 1,163 అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేశారు. అయితే పిల్లలందరికీ నులిపురుగుల సంక్రమణ ఉందా.. అని పరీక్షించి గుర్తించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. 60 శాతం మంది ఇదే సమస్యతో ఉన్నందున సామూహికంగా ఈ వయసులోని వారందరికీ నులిపురుగుల నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఆల్బెండజోల్ 400 మి.గ్రా., మాత్ర తయారు చేశారు. 1, 2 ఏళ్లలోపు పిల్లలకు 200 మి.గ్రా., మాత్ర, 6–19 ఏళ్లలోపు వారికి 400 మి.గ్రా., మాత్ర తినిపించాలి.
మాత్రలతో ప్రయోజనాలు..
నులి పురుగులను నిర్మూలించడానికి ప్రత్యేకంగా మందులు తీసుకోవడం వల్ల వాటిని పూర్తిగా నాశనం చేస్తే రక్తహీనత సమస్య తీరుతుంది. రక్తహీనతను నియంత్రించి.. రక్తశాతం, నిరోధక శక్తి, పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది. పోషకాహార లోపాన్ని నివారించి.. పోషక విలువలు పెరుగుతాయి. పిల్లలు తీసుకునే పోషక, ఆహార పదార్థాలు వారి శరీరానికి సరిగ్గా అందుతాయి. ఈ ప్రయోజనాలు సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించాలని నిర్ణయించింది. నులిపురుగుల నిర్మూలనకు ఒక్క ఆల్బెండజోల్ మాత్రను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలంటున్నారు వైద్యులు.
చేతి, కాలి వేళ్ల గోళ్లను శుభ్రంగా,
చిన్నవిగా కత్తిరించుకోవాలి.
పరిశుభ్రమైన నీళ్లను తాగడం, చుట్టూ పక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
రోజువారిగా ఇంట్లో తీసుకునే
ఆహారంపై ఎప్పుడూ మూతలు ఉంచాలి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు పరిసరాలతోపాటు ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం ఎంతో అవసరం.
పండ్లు, కాయకూరలను శుభ్రమైన నీళ్లలో బాగా కడిగి వాడుకోవాలి.
భోజనం చేసే ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, అతిసారం, విరేచనాలు, పోషకాహార లోపం, బలహీనత, ఆందోళన, ఆకలి మందగించడం, ఎదుగుదల లోపం, మందబుద్ది, కడుపునొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, మట్టి సున్నంబలపాలు తినే లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.


