కార్పొరేషన్‌ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తులు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తులు ఇలా..

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

పట్టింపులేని అధికారులు

దరఖాస్తుల సరళి ఇలా..

ఎల్‌–1 స్థాయిలో భారీగా పెండింగ్‌.. పట్టించుకోని ఉన్నతాధికారులు

నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

సరైన డాక్యుమెంట్లు లేక

నిలిచిపోయినవి వెయ్యికిపైనే..

చేతులు తడిపితేనే పనులు

జరుగుతాయన్న ఆరోపణలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు సేవలు అందించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండడం లేదని, దీంతో ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరేళ్ల క్రితం అనధికార లే అవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకుంటే.. వాటికి ప్రొసీడింగ్‌ కాపీలను దరఖాస్తుదారులకు ఇవ్వడంలోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తుదారులు కార్పొరేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్‌ అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఆర్‌ఎల్‌ దరఖాస్తుల ప్రక్రియ 2020లో జరిగితే సుమారు ఆరేళ్లుగా వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరినా.. వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలీన గ్రామాలవే ఎక్కువ..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వల్ల ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరినప్పటికీ వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. దరఖాస్తుల్లో కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలవే ఎక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జైనల్లీపూర్‌, దివిటిపల్లి వంటి వాటిలో కొన్ని సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తున్నట్లు సెక్షన్‌ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ, అధికారులు ఒకరిపై ఒకరు తోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కార్పొరేషన్‌ పరిధిలోని లే అవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం (ఎల్‌ఆర్‌ఎస్‌) లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం తీసుకొచ్చింది. అనధికార లే అవుట్లను క్రబద్ధీకరించాలంటే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి.. కార్పొరేషన్‌కు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అధికారులు ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలి. కానీ, అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో వందల సంఖ్యలో దరఖాస్తులు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. కార్పొరేషన్‌ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఎక్కువ సమయం బయట ఉంటున్నప్పటికీ ఈ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఎక్కువ దరఖాస్తులు ఎల్‌–1 స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయని.. అక్కడ క్లియర్‌ చేస్తే మిగతా దశలు త్వరగానే పూర్తవుతాయని ఒక డిపార్ట్‌మెంట్‌పై ఒకరు నెట్టివేయడం తప్పా.. పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

మహబూబ్‌నగర్‌ కార్పోరేషన్‌ పరిధిలో కొన్నినెలలుగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మొత్తం 31,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫీజు చెల్లించినవి 7,966 కాగా.. వీటిలో అప్రూవల్‌ పొందినవి 5,818 ఉన్నాయి. అలాగే ఎల్‌–1 వద్దే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. మరో 1,136 దరఖాస్తులు కేవలం డాక్యుమెంట్లు లేని కారణంగా ప్రక్రియ నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పలు దరఖాస్తులకు ఫీజు చెల్లించినా ఇప్పటికీ పరిశీలించేందుకు కూడా రాలేదన్న విషయం స్పష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement