మహబూబ్‌నగర్ రూరల్: ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి నవీన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని పాత పాలమూరుతోపాటు పలు కాలనీల్లో ఆయన పర్యటించి ఇంటింటి ఎన్యుమరేషన్, ఫారాల పంపిణీ, సేకరణ, ధ్రువీకరణ ప్రక్రియలో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న తీరును తెలుసుకుని అక్కడికక్కడే సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నవీన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, అందిన ఫారాలను వెంటనే ధ్రువీకరించి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను రోజువారీగా సమీక్షిస్తూ గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్లు దేవేందర్ కేసిరెడ్డి, సునీల్, శ్రీనివాసులు, గిర్దావర్లు నర్సింగ్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


