సీఎం దృష్టికి
తీసుకెళ్లాం..
కోయిల్‌సాగర్ పూడికతీతతో పాటు జలాశయ సామర్థ్యాన్ని మరో టీఎంసీ వరకు పెంచే అవకాశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. సీఎం సానుకూలంగా స్పందించి ఈ అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా భవిష్యత్‌లో నీటి తరలింపు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం.
– మదుసూధన్ రెడ్డి, ఎమ్మెల్యే
ఆదేశాల కోసం
ఎదురుచూస్తున్నాం
2011లో కోయిల్‌సాగర్ జలాశయంలో బాతిమెట్రిక్ సర్వే నిర్వహించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు మీటర్ల మేర పూడిక ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం అంచనా వేయాలంటే మరోసారి సర్వే అవసరం. నిల్వ సామర్థ్య పెంపు కోసం సర్వే, పూడికతీత అంశాలను ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఆదేశాలు వచ్చిన వెంటనే సాంకేతిక ప్రక్రియలు ప్రారంభిస్తాం.
– ప్రతాప్‌సింగ్, ఈఈ కేఎస్పీ
కరువులోనూ డ్యాం నీరుతో బతికాం
నా చిన్నతనంలో డ్యాంను నిర్మించారు. మా వ్యవసాయానికి అదేనీరు ఆధారం. మధ్యలో తీవ్ర కరువు వచ్చిననప్పుడు ఉన్న కొంతమేర నీటిని ఆయిల్ ఇంజన్‌లో సహాయంతో తీసుకొని డ్యాం అడుగునే పంటలు వేసుకొని బతికినం.. వర్షాలు బాగా పడి పైనుంచి వరద నీరు ఉధృతంగా వచ్చినప్పుడు మట్టి కూడా వచ్చేది. డ్యాంలో పూడిక తీయడం ఇంతవరకు చూడలేదు.
– పెద్దబాలప్ప, రైతు, కోయిల్‌సాగర్
దేవరకద్ర రూరల్: పాలమూరు రైతంగానికి జీవనాడిగా నిలిచిన కోయిల్‌సాగర్ జలశాయంలో 70ఏళ్లలో ఒక్కసారి కూడా సమగ్ర పూడికతీత చేపట్టలేదు. నీటి పారుదల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2011లో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో జలాశయంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు మీటర్ల మేర పూడిక పేరుకపోయినట్లు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు పూడికతీత పనులు చేపట్టలేదు. ఒకప్పుడు 12వేల ఎకరాల ఆయకట్టుకు నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 50వేల ఎకరాల ఆయకట్టుకు అధారంగా మారింది. సీజన్‌లో నీటి లభ్యతను బట్టి దాదాపు 35వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో జలాశయ నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలపై కసరత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే మదుసూధన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు సమాచారం. దీంతో కోయిల్‌సాగర్ పూడికతీత అంశంపై రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కరువు నేలపై ఆవిర్భావం
కేవలం వర్షపునీటిని ఒడిసిపట్టి పాలమూరు ప్రాంతంలో కరువు పరిస్థితులను అధిగమించి వర్షాధార వ్యవసాయానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో నిజాం పాలనలో 1945లో రూ.85లక్షల అంచనావ్యయంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం అనంతరం నిర్మాణం పూర్తయి నీటిని నిల్వ చేయడం ప్రారంభించినా.. ఈ జలాశయం తొలినాళ్లలో కేవలం 12వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరందించే వర్షాధార ప్రాజెక్ట్‌గా ఉండేది. అనంతరం ప్రభుత్వాలు వారీగా ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయింపులు జరపడంతో కాల్వల విస్తరణ, పంపిణీ వ్యవస్థ అభివృద్ధి, ఆధునీకరణ పనులతో ఆయకట్టు లక్ష్యం మారడంతో కోయిల్‌సాగర్ కేవలం సాగునీటి వనరుగా కాకుండా ఉమ్మడి పాల మూరు జిల్లాలో జలభద్రతకు కీలకంగా మారింది.
2011లోనే సర్వేలో బయటపడిన వాస్తవాలు
70ఏళ్లుగా పూడికతీతకు నోచుకోని జలాశయం
పెరిగిన బాధ్యతలు..తగ్గుతున్న నిల్వ సామర్థ్యం


