కొత్తకోట రూరల్: వర్షాకాలంలో బత్తాయి, నిమ్మతోటల్లో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, ఎగిరేపేను, తెల్లపొలుసు పురుగులు, నల్లదోమ, నల్లిపురుగుల ఉధృతి అధికంగా ఉండి పంట దిగుబడిని 20– 30శాతం వరకు తగ్గిస్తున్నాయి. రసం పీల్చు పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్‌రెడ్డి సూచనలు సలహాలు.
చీనిలో తామర పురుగులు:ఆకు కణజాలాన్ని తిన డం వల్ల పండుతొడిమ భాగంలో మచ్చలాగా ఏర్ప డి, కాయపై చారలుగా ఏర్పడటం వల్ల మార్కెట్‌లో కాయకు ధర తగ్గుతుంది. తెల్లదోమ ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ అధికంగా ఉంటే ఆకులు, పూత, పిందెలపై ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
ఎగిరే పేను: ఆకులు, పూతపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ‘శంకు తెలుగు’ను వ్యాప్తి చేస్తుంది.
నల్లదోమ: పిల్ల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చి తేనే లాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల ‘నల్లటి బూజు’ ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క క్షీణిస్తుంది. నల్లిలో ముఖ్యంగా ఆకుపచ్చ నల్లి, మంగునల్లి ముఖ్యమైనవి. ఇవి ఆకులపై రసాన్ని పీల్చడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. మంగునల్లి కాయలపై రసాన్ని పీల్చడం వల్ల ముదురు గోదుమరంగు లేదా ఊదారంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది.
రసం పీల్చు పురుగుల నివారణకు: థైమిథేమేట్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.5 మి.లీ. లేదా థమోమితాక్సామ్ 0.4 గ్రా. లేదా ఎసిటామిఫిడ్ 0.4గ్రా. లేదా డైఫెన్‌థియొరాన్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి ఆకు కింద భాగాలు, చెట్టు కొమ్మలు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
తెల్లనల్లి, మంగునల్లి నివారణకు: ప్రొపార్‌జైట్ 1.5 మి.లీ. లేదా ఇథియాన్ 1.5 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 1 మి.లీ. లేదా ఫెన్జాక్వీన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి గోళికాయ దశలో ఒకసారి, 20 రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేయాలి.
పాడి–పంట


