చారకొండ: పాము కాటు కు గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని చంద్రాయన్‌పల్లిలో చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయన్‌పల్లికి చెందిన డెరంగుల తిరుపతమ్మ (48) గత బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందింది. తిరుపతమ్మ భర్త పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
యువ రైతు మృతి
ఉప్పునుంతల: పత్తి మొలకలకు నీరు పెట్టడానికి పొ లం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం మండలంలోని తిప్పాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పాపూర్‌కు చెందిన రైతు రాజపుత్ర వెంకటేశ్వర్ సింగ్ (37) తనకున్న పది ఎకరాల పొలంలో వరి పంట సాగుకు వేసిన నారుమడి, పత్తి, కీరదోస పంటను సాగుచేశాడు. రోజు మాదిరిగానే తెల్లవారుజామున పత్తి మొలకలకు స్పింక్లర్లతో నీరు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. స్తంభం వద్ద నుంచి స్టార్టర్ వరకు కట్టెలపై వేలాడదీసిన సర్వీస్ వైరు తెగిపోవడంతో మోటారు నడవలేదు. దాంతో తెగిపోయిన సర్వీస్ వైరును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. పొలం గ్రామానికి సమీపంలోనే ఉండటంతో తండ్రి వెంట వెళ్లిన పదేళ్ల పెద్ద కొడుకు హర్షవర్ధన్‌సింగ్ ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. దాంతో గ్రామస్థులు అక్కడి వెళ్లి చూసే లోపే వెంకటేశ్వర్‌సింగ్ చనిపోయాడు. మృతుడికి భార్య పూజాబాయి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్‌గౌడ్ తెలిపారు.
చోరీ చేసిన బైక్‌పై వెళ్తూ వ్యక్తి మృతి
కల్వకుర్తి రూరల్/వంగూరు: బైక్ చోరీ చేసి తీసుకెళ్లే క్రమంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు వంగూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన చాకలి శ్రీను(34) హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో వంట మనిషిగా పనిచేస్తుండేవాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. అదే క్రమంలో కల్వకుర్తిలో చోరీ చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక తన ప్రవృత్తి ఏమాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో సోమవారం వంగూరులో బైక్ చోరీ చేసి మార్గమధ్యలో మద్యం తాగి డిండి వైపు వెళ్తుండగా వంగూరు మండలంలోని వెలమల్లపల్లి గేటు సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు 108 పైలట్ శ్రీశైలం, ఈఎంటీ అఫ్జల్ వెల్లడించారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ ముజీబ్ తెలిపారు.
పండ్ల దుకాణంలో
అగ్నిప్రమాదం
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో పండ్ల దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో మంటలు ఒకేసారి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పండ్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచా రం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తెచ్చా రు. ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
‘వైటీపీఎస్’ను కాపాడండి
మన్ననూరు: దామరచర్లలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘వైటీపీఎస్‌ను కాపాడండి.. టీజీ జెన్‌కో’ను రక్షించండి అని సోమవారం భోజన విరామ సమయంలో ఈగలపెంటలో ఉన్న శ్రీ శక్తి సదన్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున భూగర్భ కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు నినాదాలు చేశారు.


