● పత్తి, ఆముదం రైతులను వేధిస్తోన్న
బెట్ట పరిస్థితులు
● ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
మదనాపురం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మెట్ట రైతులకు పరీక్షా సమయంగా మారింది. రుతుపవనాల నిస్తేజం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావంతో ఆకులు వాడిపోవడం, ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సాంప్రదాయ ఏక పంటల సాగు విధానం కంటే, బహుళ పంటల సూత్రాలు, శాసీ్త్రయ తేమ సంరక్షణ చర్యల ద్వారానే పంటలను కాపాడుకోగలమని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరిస్తున్నారు.
వేర్వేరు స్థాయిల్లో వర్షాభావ ప్రభావం..
చల్కా,దుబ్బ నేలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పాలీ పంట కరవు కాలంలో రైతుకు రక్షాకవచం. పరిశోధన ల ప్రకారం, తీవ్రమైన ఎండలు మరియు వర్షాభావ స మయాల్లో ఒకే పంటపై ఆధారపడటం వల్ల నష్టా లు తప్పవు. పాలీ పంట లేదా అంతర పంటల విధా నం ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
సూక్ష్మ వాతావరణం సష్టి:
పత్తి లేదా ఆముదం వరుసల మధ్య పెసర, మినుము లేదా అలసందలు లాంటి తక్కువ కాలపరిమితి గల పప్పుధాన్యాల పంటలను వేయడం వల్ల అవి భూమిని త్వరగా కప్పి ఉంచుతాయి. ఇది నేలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా నిరోధించి, నేల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఫలితంగా భూమిలోని తేమ ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
వేర్ల సమర్థత:
పత్తి, ఆముదం వేర్లు భూమి లోపలి పొరల నుంచి అంతర పంటల వేర్లు పైపొరల నుంచి నీటిని గ్రహిస్తాయి. దీనివల్ల నీటి పోటీ ఉండదు. ఒకవేళ తీవ్ర కరవు వల్ల పత్తి దెబ్బతిన్నా అంతర పంటగా ఉన్న పప్పుధాన్యాలు లేదా కందులు రైతును నష్టాల నుంచి గట్టెక్కిస్తాయి.
పంటల వారీగా తక్షణ యాజమాన్య సూచనలు:
పొలంలో గుంటుకలు లేదా దంతులు తోలడం ద్వారా భూమి పగుళ్లు పూడిపోతాయి. కలుపు తీసిన వ్యర్థాలను మొక్కల మొదళ్ల వద్ద పరచడం ద్వారా తేమను ఆదా చేయవచ్చు.
బాహ్య పోషకాల పిచికారీ:
వేర్లు నీరు లేక పోషకాలను తీసుకోలేవు కాబట్టి ఆకుల ద్వారా ఆహారం అందించాలి. లీటరు నీటికి 10 గ్రాముల యూరియా లేదా 13:0:45 (పొటాషియం నైట్రేట్) కలిపి ఎండ లేని సమయంలో పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
రసం పీల్చే పురుగుల అదుపు:
వాతావరణం పొడిగా ఉండటం వల్ల తెల్లదోమ, పచ్చదోమ ఆశిస్తాయి. నివారణకు ఎకరాకు 20 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను తోటల్లో ఏర్పాటు చేయాలి.
ఆముదం పంట సంరక్షణ చర్యలు:
మొక్కల పల్చబరచడం గింజలు మొలిచిన 20 రోజుల్లోపు బలహీనమైన మొక్కలను పీకేసి, సిఫార్సు చేసిన సంఖ్యలోనే ఉంచాలి. దీనివల్ల తక్కువ నీరు ఉన్నా ఉన్న మొక్కలకే అందుతుంది.
దాసరి
పురుగు నివారణ:
వేడి వాతావరణంలో ఆముదాన్ని ఆశించే దాసరి పురుగు గుడ్ల సముదాయాలను గమనించి ఏరివేయాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే వేపనూనె (5 మి.లీ/లీటరు నీటికి) పిచికారీ చేయాలి.
ఆత్రుతతో యూరియా చల్లొద్దు:
వనపర్తి జిల్లాలోని 15 మండలాల రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధైర్యపడకూడదు. ప్రస్తుతం నేలలో తగినంత తేమ లేదు. కాబట్టి రైతులు తొందరపడి నేరుగా భూమిలో యూరియా లేదా ఇతర కాంప్లెక్స్ ఎరువులను చల్లకూడదు. తేమ లేనప్పుడు ఎరువులు వేస్తే మొక్కలు మరింత త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. డ్రిప్ లేదా మైక్రో–స్ప్రింక్లర్ల ద్వారా ప్రాణ రక్షణ తడులు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
పాడి–పంట


