జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచాలని డీఆర్‌ఓ నిర్మల అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, మైక్రో ఇరిగేషన్, ప్రీ యూనిక్ ఆయిల్‌పాం కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జాతీయ వంట నూనెల మిషన్– ఆయిల్‌పాం పథకం కింద పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టిసారించాలన్నారు. గతంలో సాంకేతిక బృందం, భారతీయ ఆయిల్‌పాం పరిశోధనా సంస్థ జిల్లాలో 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం పంట వేయడానికి అవకాశం ఉందని గుర్తించగా.. ఇప్పటి వరకు 4,782 ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,500 ఎకరాల లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 792 ఎకరాలకు పరిపాలనా అనుమతులు లభించాయన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలు, వివిధ రకాల రాయితీ పథకాలను వివరించారు. డీఏఓ గోవింద్‌నాయక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచడంలో వ్యవసాయ శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు. సహకార సంఘాల అనుసంధానంపై జిల్లా అధికారి కృష్ణ్ణ మాట్లాడుతూ పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అవసరమైన ఆర్థిక సాయం, ఎరువులు, పెట్టుబడి మద్దతు అందించే మార్గాలను వివరించారు. ఆయిల్‌పాం రైతులకు ప్యాక్స్ నెట్‌వర్క్ ఎంతగానో తోడ్పడుతుందని చెబుతూ, ప్యాక్స్ సీఈఓలకు సాగు నమోదుకు సంబంధించిన నిర్దేశిత బాధ్యతలను అప్పగించారు.
యూరియా వివరాలు
ఆన్‌లైన్‌లో నమోదు
జడ్చర్ల: జిల్లాలో విత్తనాలు, యూరియా విక్రయాలకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఏఓ గోవింద్‌నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మల్లెబోయిన్‌పల్లి గ్రామ రైతువేదికలో సీడ్ సేల్స్ మేనేజ్‌మెంట్ డివిజన్ స్థాయి డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన సన్న రకాల ధాన్యం విత్తనాలు, రైతులకు విక్రయించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే ప్రతినెలా 5లోగా ఫారం డీని ఆన్‌లైన్‌లో సమర్పించాలని, యూరియా బుకింగ్, అమ్మకాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. యూరియా వచ్చిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ చేయాలని, ఈ పాస్ మిషన్ల ద్వారానే యూరియా విక్రయించాలని సూచించారు. డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరి పాటించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏడీఏ విజయనిర్మల, ఏఓ గోపినాథ్, ఏఓలు తదితరులు పాల్గొన్నారు.


