మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికై న అధికారులు, సిబ్బంది అదే పట్టుదలతో ప్రతిభ కనబరిచి జోన్–7కు పేరు తీసుకురావాలని ఎస్పీ జానకి అన్నారు. జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్–2026, 27 ముగింపు కార్యక్రమం మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. డ్యూటీ మీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్యూటీ మీట్‌లలో సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలు మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రత్నం, సురేష్‌కుమార్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్, భూత్పూర్ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో ఈ నెల 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–12 కార్యక్రమం ద్వారా బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. 18 ఏళ్లులోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సైబర్ వారియర్స్‌కు శిక్షణ
జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారించి, సైబర్ వారియ ర్స్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ దోహద పడుతుందని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ వారియర్స్, అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాల్లో కోల్పోయిన నగదు వీలైనంత త్వరగా రికవరీ చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం సైబర్ క్రైం డీఎస్పీ గిరికుమార్ సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ఎన్‌సీఆర్‌పీ పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.


