జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని బోయపల్లి అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం సందర్శించారు. శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయబోతున్న ప్రీ లిటరసీ, ప్రీ న్యూమరసీ ఆధారిత బేసిక్ లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధులు కార్యక్రమం వివరాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 50 అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి, చిన్నారుల్లో ప్రీ లిటరసీ, ప్రీ న్యూమరసీ, మోటార్ స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీలకు ట్యాబ్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, టీచింగ్– లెర్నింగ్ మెటీరియల్, స్టేషనరీతోపాటు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రియదర్శిని’ పాఠ్యాంశాలకు అనుగుణంగా ‘శిశు వికాసన’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించిందని, ఉపాధ్యాయులు ప్రతిరోజూ నిర్వహించాల్సిన బోధనా కార్యక్రమాలు ఇందులో ఉండటం వల్ల చిన్నారులకు సులభంగా బోధన చేయవచ్చన్నారు. పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మెరుగుదలకు ప్రేరణ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. అలాగే విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేసేందుకు పిక్టోరియల్ ప్రోగ్రెస్ కార్డులు, తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ఫౌండేషనల్ లెర్నింగ్ పుస్తకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, ఎంఈఓ లక్మణ్‌సింగ్, శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


