● మొత్తం 81 అంశాలతో ఎజెండా
● అభివృద్ధి పనులు, షాప్‌ల వేలం, ఇతర పనులకు నిధుల కేటాయింపు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం నిర్వహించే టెండర్లు, వివిధ రోడ్ల నిర్మాణాలు, డ్రెయినేజీలు, బ్రిడ్జిల మరమ్మతు వంటి పనులకు కౌన్సిల్ సభ్యుల ఆమోదం కోసం సమావేశం చేపడుతున్నారు. గత నెల 30నే కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో సమావేశానికి పూర్తిస్థాయిలో సభ్యులు హాజరవుతారా.. లేదా.. అనేది కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం 60 మంది కార్పొరేటర్లలో 50 శాతానికిపైగా సభ్యులు హాజరై.. అందులో మెజార్టీ సభ్యులు ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపితే సరిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏజెండాలోని అంశాలు..
వీధిలైట్ల ఏర్పాటు కోసం రూ.49.50 లక్షలు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు రూ.10 లక్షలు, మేయర్ చాంబర్ రెన్నోవేషన్ కోసం రూ.19 లక్షలు, కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్‌కు ఒక్కో పని ఏజెండాలో పొందుపర్చారు. ఒక్క 11వ డివిజన్‌లో మాత్రమే రూ.2.50 లక్షలుగా ఉంది. మిగతా అన్ని డివిజన్లలోనూ రూ.5 లక్షల పనులు చూపించారు. వీటితోపాటు కార్పొరేషన్ పరిధిలోని పలు షాపుల వేలం, శిల్పారామంలో షాపుల కేటాయింపు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం షూ, గ్లౌస్ ఇతర సామగ్రి కొనుగోలు, గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కార్పొరేషన్ పరిధిలో 1,281 కుక్కలను పట్టారని, వీటికి ఒక్కో కుక్కకు రూ.1,400 చొప్పున మొత్తం రూ.17,93,400 చెల్లించేందుకు ఆమోదం తెలపనున్నారు.


