
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/మహబూబ్‌నగర్ క్రైం/భూత్పూర్: జిల్లావ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో అడపాదడపా వర్షం కురిసినా.. రోజంతా ముసురు కమ్మేసింది. జిల్లాలో అత్యధికంగా చిన్నచింతకుంటు మండలంలో 6.04 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మూసాపేటలో 5.16 సెంమీ, కౌకుంట్ల 4.48, కోయిలకొండ 4.02, గండేడ్ 4.16, హన్వాడ 4.46, భూత్పూర్ 4.15, అడ్డాకుల 3.64, మహహ్మదాబాద్ 3.94, జడ్చర్ల 3.83, మిడ్జిల్ 3.20, రాజాపూర్, బాలానగర్ 3.04, మహబూబ్‌నగర్ అర్బన్ 3.51, దేవరకద్ర 3.4, నవాబుపేట 3.48, మహబూబ్‌నగర్ రూరల్ 2.97 సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 823 చెరువులు, కుంటలు ఉండగా.. 599 చెరువులు అలుగు పారుతున్నాయి. దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు పలు చెరువులు మత్తడి దూకుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. భూత్పూర్ మండలంలోని పోతులమడుగు–గోపన్నపల్లి గ్రామాల మధ్య కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ ప్రభాకర్ ఉన్నారు.
ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం
జిల్లాలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా సహాయం అవసరం అయిన వాళ్లు 87126 59360 నంబర్‌తో పాటు డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరంతరం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వర్షం ఎలాంటి ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.
చేపల వేటకు వెళ్లొద్దు: ఎస్పీ
జిల్లాకేంద్రంలోని అప్పన్నపల్లి బ్రిడ్జిపై వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఎస్పీ డి.జానకి సోమవారం పరిశీలించారు. మయూరి పార్క్–జాలీహిల్స్ మలుపు దగ్గర గుట్టపై నుంచి వచ్చే వర్షం వరద కారణంగా రోడ్డు అంచుభాగం కోతకు గురైంది. దీంతో కాంట్రాక్టర్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. రోడ్డుకు వెంటనే అవసరమైన మరమ్మతు చేయాలని సూచించారు. నిరంతరం వర్షాలు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. డ్రెయినేజీలు, మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంటాయని, పాదాచారులు జాగ్రత్తగా నడవాలన్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపై ప్రయాణం చేయరాదని, ఇనుప తీగలపై దుస్తులు అరబెట్టరాదన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే నదులు, వాగుల్లో చేపల వేటకు వెళ్లరాదన్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
పోలేపల్లి రంగనాయకమ్మ చెరువు మత్తడి దూకుతుండడంతో.. ఇలా అలుగుపై నుంచే రాకపోకలు సాగిస్తున్న పోలేపల్లి, కిష్టారం గ్రామస్తులు
రోజంతా నగరాన్ని కమ్మేసిన ముసురు
సీసీ కుంటలో అత్యధికంగా 6.04సెం.మీ వర్షపాతం నమోదు