
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో గురుకులాలు, సంక్షేమ హాస్లళ్లను అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకాధికారు లు తమకు కేటాయించిన వాటిని తనిఖీ చేసి విద్య ఐ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సమస్యలు గుర్తిస్తే మరమ్మతు, మౌలిక వసతులు, అత్యవసర పనులను వెంటనే అంచనా వేసి మంజూరు తీసుకుని పనులు చేయించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేపట్టకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందరిమ్మ ఇళ్లు పీఏఎంఏవై సర్వే చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రాధాన్యతగా భావించి ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజూ పదిఇళ్లు సర్వే చేయాలన్నారు. అప్పుడే కేంద్రం గ్రాంట్స్ మంజూవుతాయన్నారు. ఐదుశాతం కంటే తక్కువ సర్వే చేసి అప్‌లోడ్ చేసినవారికి షోకాజ్ జారీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అలాగే వర్షాలు పడుతున్నందున ప్రత్యేకాధికారులు ఎండీపీఓలు, తహసీల్దార్లను జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంచాలన్నారు. రోడ్లు, చెరువులు, గండి పడినా తక్షణ మరమ్మతు చేపట్టాలన్నారు.
ప్రజావాణికి 82 ఫిర్యాదులు
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 82 ఫిర్యాదులు రాగా.. కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండింగ్ పెట్టుకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, ఆర్‌డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు పాల్గొన్నారు.