
పనుల బాధ్యత మీది.. నిధుల బాధ్యత నాది
జడ్చర్ల: నియోజకవర్గంలో భారీ వర్షాల పట్ల సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏఏ పనులు చేస్తారో ఆ బాధ్యత మీది.. అందుకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని ఎమ్మెల్యే అనిరధ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అధిక వర్షాలు, ఇబ్బందులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాటట్లాడుతూ.. చెరువులు, వాగులు, ప్రవాహాల ఉధృతి తీవ్రంగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా చెరువులను సందర్శించి బలహీనపడిన కట్టలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. చెరువు కట్టల పటిష్టతపై సర్వేచేసి ప్రమాదం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పడు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పనులు చేపట్టేందుకు రూ.11కోట్లతో సేఫ్టీ బడ్జెన్‌ను ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆయన సీఎండీకి ఫోన్ చేసి విషయం చెప్పగా.. సానుకూలంగా స్పందించారు. జడ్చర్లలో నల్లకుంట, నల్లచెరువు, ఊరచెరువుకు సంబంధించిన వరద నీరు ప్రవహించే ఫీడర్ ఛానల్స్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం నీరు రోడ్లపైకి రాకుండా, వరదల కారణంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరో 20ఏండ్ల వరకు సరిపోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా వెంచర్లు తదితర ప్లాటింగ్ చేస్తే నిర్మొహమాటంగా తొలగించాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నియోజకవర్గం స్థాయిలో అన్నిశాఖల అధికారులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి అందులో సమస్యలపై స్పందించే విధంగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలోఅధికారులతో సమీక్ష
వంతెన నిర్మించాలని వినతి
పోలేపల్లి–కిష్టారం మధ్య పోలేపల్లి చెరువు అలుగు పారుతుండడంతో రాకపోకలు నలిచిపోయాయని వెంటనే అక్కడ వంతెన నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అలాగే అంబటాపూర్–కిష్టారం మధ్య బీటీరోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 284లో ఇచ్చిన ఎన్‌ఓసీ రద్దు చేసి నాగులకుంటను పునరుద్ధరించాలని, చెరువును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వెంకటయ్య ఫిర్యాదు చేశాడు.