
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఉధృతంగా పారుతున్నాయని ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదివారం ఆమె హన్వాడ, చిన్నదర్పల్లి, బోయపల్లి, టంకర చెరువులను పరిశీలించారు. చెరువులలో నీటి మట్టం ఎలా ఉంది.. వర్షాల వల్ల ముంపు గ్రామాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఆరాతీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వరద ప్రభావం ఉండే గ్రామాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా నిమజ్జనం సందర్భంలో యువకులు క్రమశిక్షణ పాటించాలని, చిన్నారులను చెరువుల దగ్గరకు తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి ఊరేగింపులో పాల్గొని.. నిమజ్జనం కోసం చెరువుల దగ్గరకు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు నిండిన క్రమంలో వాటి పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు పడిపోవడం జరుగుతాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రైతులు, పశువుల కాపరులు పొలాల దగ్గరకు వెళ్లే సమయంలో విద్యుత్ మోటార్ల దగ్గర, పాములతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
జిల్లాలో గణనాథుడిని ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపుల అనుమతి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ఆన్‌లైన్ ప్రత్యేక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసే సమాచారం కేవలం మండపం నిర్వహణ సమాచారం మాత్రమే ఉంటుందని, దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి పోలీస్ శాఖ ఆన్‌లైన్‌లో అనుమతులు జారీ చేస్తుందని, ఆ తర్వాతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.