
హేమసముద్రం చెరువుకు నిధులు కేటాయించాలి
హన్వాడ: జిల్లాలోనే అతి పెద్దది అయిన మండలంలోని హేమసముద్రం చెరువుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ చెరువును రిజర్వాయర్ చేద్దామనుకున్నా.. ఓ గ్రామం, రెండు తండాలు ముంపునకు గురవుతున్నాయన్న కారణంతో విరమించుకొని.. ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలతో నింపేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువుకట్టకు ఏర్పడిన గండికి అధికారులు తీసుకున్న చర్యలపై ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టకు ఏర్పడిన గండి కారణంగా చెరువులోని నీరు లీకై పంటతోపాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో తీవ్ర వర్షాలతో వచ్చే నీటిని ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు నింపుకొనేవాళ్లమని, ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని విమర్శించారు. అధికారులు తీసుకున్న చర్యలు సక్రమంగా లేవని, బుంగ మరమ్మతు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అలాగే చెరువులు, కుంటలపై అధికారులు పర్యవేక్షణ చేసి తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు జంబులయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు, నరేందర్, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.