
శిక్షణ.. ఉపాధి
ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండ లేని యువతకు.. సాంకేతిక విద్య అభ్యసించినా నైపుణ్యం లేని విద్యార్థులకు.. వివాహమై ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని
పరితపించే అతివలకు.. డిమాండ్ ఉన్న రంగాల్లో పట్టు సాధించాలి అనే యువకులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్.. యువకులకు కంప్యూటర్ హార్డ్‌వేర్, సీసీ కెమెరాల రిపేర్, డ్రోన్ల నిర్వహణ.. ఇలా ఎన్నో అంశాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితోపాటు పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. తాజాగా
ఈ శిక్షణ కేంద్రం జడ్చర్లలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. – జడ్చర్ల
నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడానికి 1978లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా యువతకు శిక్షణ ఇచ్చేది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థ 2007 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచడానికి జిల్లాలకు విస్తరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25కు సంబంధించి జహిరాబాద్, జడ్చర్లలో మరో రెండు సెట్విన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు గతేడాది ఆగస్టులో జడ్చర్లలోని జౌఖీనగర్‌లో నిరుపయోగంగా ఉన్న గురుకుల భవనాన్ని ఆయనతోపాటు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, సంస్థ ఎండీ వేణుగోపాల్ పరిశీలించారు. అక్టోబర్‌లో కేంద్రాన్ని ప్రారంభిస్తామని కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు త్వరలో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధిత పాలకులు, అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఎంతో మందికి ఉపాధి
జడ్చర్లలోని జౌఖీనగర్ గురుకుల భవనాన్ని శిక్షణకు సిద్ధం చేశారు. రూ.20 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర మౌళిక వసతులు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 శిక్షణా కేంద్రాల ద్వారా యువత, అతివలకు శిక్షణ అందిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఆయా సర్టిఫికెట్లతో దేశంలోని ఎక్కడైన పరిశ్రమలు, తదితర యూనిట్లలో ఉపాధి పొందవచ్చు. సెట్విన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతేగాక స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఈ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న శిక్షణ కేంద్రం జడ్చర్లలో ఏర్పాటు కావడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పలు కోర్సులలో శిక్షణ
రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పలు రంగాల్లో నైపుణ్యతను పెంచేందుకు సెట్విన్ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రధానంగా యువతకు అక్కరకు వచ్చే వృత్తులలో సంతరించుకుంటున్న ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, జరీ అల్లడం వంటి ప్రాధాన్యత కోర్సులతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ హార్డ్ వేర్, ఎయిర్ లైన్ టికెటింగ్, సెల్‌ఫోన్ రిపేర్, స్పోకెన్ ఇంగ్లీష్, ప్రింటింగ్ ప్రెస్, సీసీ కెమెరాల మరమ్మతులతో పాటు ఏసీ, వాషింగ్‌మిషన్, ఆర్‌ఓ మిషన్స్, కటింగ్ అండ్ టైలరింగ్, డ్రోన్ నిర్వహణ, తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వనుంది. అయితే మొదటగా కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గా ర్మెంట్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్ కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అడ్మిషన్లు ప్రారంభం
సెట్విన్ శిక్షణ కేంద్రంలో దాదాపు 400 మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఎంపిక చేసిన కోర్సులలో 3 నెలల పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకు నామమాత్రంగా ఫీజు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తాం. ఈ సర్టిఫికెట్లు పొందిన వారికి పరిశ్రమలలో, బ్యాంకు రుణాల మంజూరులో తగు ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయి. – విజయ్‌కుమార్, సెట్విన్ కోఆర్డినేటర్, జడ్చర్ల
సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో నిరుద్యోగ యువతీ,యువకులకు సెట్విన్ శిక్షణ కేంద్రం వరం లాంటింది. ఇక్కడ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ,ఉపాధి రంగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు మాత్రమే కాకుండా ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. – అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
నిరుద్యోగుల పాలిట వరం.. సెట్విన్ శిక్షణ కేంద్రం
మహిళలు, యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ
జడ్చర్లలో ఏర్పాటుకు సర్వం సిద్ధం
రూ.20 లక్షలతో భవనంలో మౌలిక వసతుల కల్పన