
కాల్పులు విరమించి.. శాంతి చర్చలు జరపాలి
అచ్చంపేట: కగార్ హత్యాకాండను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరిపి.. కాల్పుల విరమణ పాటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు వరంగల్ అంబేడ్కర్ భవన్‌లో ఈ నెల 24న నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి వాల్‌పోస్టర్లను ఆదివారం అచ్చంపేట అమరవీరుల స్థూపం వద్ద పలువురు నాయకులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నర దశాబ్దాలుగా ఆదివాసీలను వెంటాడుతూ, హత్యలు చేస్తూ రూ.కోట్లాది విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసి ఉద్యమాలు బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో సల్వా –జుడుము, గ్రీన్ హంట్, సమాదాన్ ప్రహార్ ఆపరేషన్లు, కగార్ పేరుతో పాశవికమైన హత్యాకాండను కొనసాగిస్తున్నాయన్నారు. 70 ఎన్‌కౌంటర్లలో 600లకు పైగా ఆదివాసీలను, ఉద్యమకారులను హత్య చేసిందన్నారు. ఇది చాలదన్నట్లు ఇంకా దారుణ మారణకాండను కొనసాగిస్తూ 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్‌ను నిర్మిస్తామని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ప్రగల్బాలు పలుకుతున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో సీఎల్‌సీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, టీపీఎప్ రాష్ట్రకో కన్వీనర్ ఎడ్ల అంబన్న, బయ్యని శ్రీశైలం, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు ముద్దునూరి లకీ్‌ష్మ్‌నారాయణ, జిల్లా కో–కన్వీనర్ పర్వతాలు, నల్లమల కళాకారులు జక్క గోపాల్, టీఎన్‌వీఎఫ్ కన్వీనర్ గోరటి అనిల్ కుమార్, సీఎల్‌సీ నాయకులు పంబలి బాలయ్య, బియ్యని వెంకటేష్, నారుమల్ల లకీ్‌ష్మ్‌నారాయణ, డీటీఎఫ్ నాయకులు చారగొండ శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.