
తాళం వేసిన ఇంట్లో చోరీ
గద్వాల క్రైం: గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని హమలీకాలనీలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి చిన్న రాములు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి మూడురోజుల కిందట హైదరాబాద్‌లోని బంధువుల వద్దకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపునకు వేసిన తాళం తెరుచుకొని కనిపించింది. లోనికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకొని చోరీ ఘటనపై ఆరా తీశారు. సాంకేతిక నిపుణులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెడ్‌రూంలోని బీరువాలో భద్రపర్చిన 16 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
16 తులాల బంగారు
ఆభరణాల అపహరణ