
పోలేపల్లి–కిష్టారం మధ్య నిలిచిన రాకపోకలు
జడ్చర్ల టౌన్: భారీవర్షాల కారణంగా మండలంలోని పోలేపల్లి–కిష్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి సమీపంలోని రంగనాయక చెరువు మత్తడి దూకడంతో భారీగా వరదనీరు రోడ్డుపై పారుతోంది. దీంతో జడ్చర్ల–నవాబుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఫార్మకంపెనీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిష్టారం, ఖానాపూర్, ఉదండాపూర్ తోపాటు నవాబుపేట మండలంలో నివాసముంటున్న ఫార్మ ఉద్యోగులు విధుల్లోకి చేరేందుకు బయలుదేరగా రోడ్డుపై వరదనీరు పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. చెరువు అలుగునీరు నుంచి ఇబ్బందులు తొలగించేందుకు రోడ్‌డ్యాం నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రాయపల్లి, గుండ్లగడ్డతండాకు..
పోలేపల్లి నుంచి రాయపల్లి, గుండ్లగడ్డతండాకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి నుంచి రాయపల్లికి వెళ్లేమార్గంలో దర్గావద్ద ఫీడర్‌చానల్ మూసివేయడంతో వరదనీరు ఎటూపోలేక గ్రామంచుట్టూ నీళ్లు నిల్చున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ప్రహరీ నిర్మించడంతో వరదనీరు పోవడంలేదని, ఇదే విషయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రహరీ కూల్చివేసి నీళ్లువెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నర్సింగ్‌రావును ఆదేశించారు. మంగళవారం పోచమ్మ బోనాలు, శుక్రవారం దర్గా ఉర్సు ఉండగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.