
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/రాజోళి/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. శనివారం రాత్రి 8 గంటలకు వరకు 85 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెకులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి 77,946 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 38,818 వదలగా.. 46 క్యూసెక్కులు ఆవిరైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయినీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.989 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సుంకేసులకు 53వేల క్యూసెక్కులు..
సుంకేసులకు ఆదివారం ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో 53వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో 12 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 49,632 క్యూసెక్కులను దిగుకు, కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేసీ మహేంద్ర తెలిపారు.
415 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి..
జూరాలకు ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది లక్ష్యానికి చేరువగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ ఏడాది మే నుంచే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 2025 –26 కు సంబంధించి 610 మి.యూనిట్లు లక్ష్యం కాగా.. ఆగస్టు 17 నాటికి 415 మి.యూనిట్లు చేరుకుంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుంచి జూరాలకు వరద పోటెత్తుతోంది. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుంది. ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 236.943 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వార 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి