
ముకుందా.. ముకుందా
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉట్ల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంలోని చివరి శనివారం రాత్రి స్వామివారి సన్నిధిలో ఉట్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉట్ల మహోత్సవంలో ఓబ్లాయపల్లి గ్రామానికి చెందిన భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు. ఉట్ల మహోత్సవం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారిని పల్లకీలో గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన్యంకొండకు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది.
వైభవంగా శేషవాహనసేవ
వేంకటేశ్వరస్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. దేవస్థానంలో ప్రతి శనివారం స్వామివారి తిరుచ్చిసేవ జరిపిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారి విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను రెండోరోజు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి కలశాభిషేకం, పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, అలంకారం తదితర పూజలు చేశారు. సాయంత్రం మురళీకృష్ణ మందిరం నుంచి పద్మావతికాలనీ కమాన్ వరకు స్వామివారిని రథంలో ఊరేగించి.. ఉట్ల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
మన్యంకొండలో ఘనంగా
శ్రీకృష్ణాష్టమి వేడుకలు