అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ ! | - | Sakshi
Sakshi News home page

అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ !

Aug 19 2025 6:50 AM | Updated on Aug 19 2025 6:50 AM

అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ !

అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ !

‘జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడికి జ్వరం వస్తే తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు బాలుడిని పరీక్షించిన వైద్యుడు డెంగీ పరీక్షతో పాటు ఇతర రక్త పరీక్షలు చేయించాలని టెస్ట్‌లు రాశాడు. అదే ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్‌కు వెళ్లాగా..రక్త పరీక్షలకు రూ.3,500 వసూలు చేశారు. డెంగీ నిర్ధారణ కావడంతో ఆడ్మిట్‌ చేసుకొని చికిత్స చేయాలని చెప్పి దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యంచేసి..రూ.60 వేల వరకు బిల్లు తీసుకున్నారు.’

పాలమూరు: జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఉండే వైద్యుల వివరాలు, సౌకర్యాలు తదితరలన్నీ జిల్లా వైద్యారోగ్యశాఖలో వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ప్రత్యేక విభాగం నుంచి ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రికి అనుమతులు పొందుతున్నప్పటికీ వారు సమర్పించిన వివరాల మేరకు తనిఖీల సందర్భంగా ఉండటం లేదు. తరచూ వైద్యులు మారుతున్నా వివరాలను నమోదు చేయడం లేదు. స్కానింగ్‌ కేంద్రాలతో పాటు ల్యాబ్‌ల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. నిబంధనలను విస్మరించి యథేచ్ఛగా స్కానింగ్‌లు చేస్తున్నారు. దీంట్లో కొన్ని తనిఖీల్లో వెలుగులోకి రాగా.. మరికొన్ని బయటకు రాకుండా లోలోపల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.

● జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చాలా వరకు అనుమతులు తీసుకున్న సమయంలో ఉన్న పడకలు (బెడ్స్‌) ఆ తర్వాత ఉండటం లేదు. 20 పడకలతో అనుమతి తీసుకుంటే కొన్ని రోజుల వ్యవధిలో వాటి సంఖ్య రెట్టింపు చేసుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు పొందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి పెంచితే మరికొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి తగ్గిస్తున్నారు. ఇక ఆరోగ్య శ్రీ అనుమతులు తీసుకోవడానికి 35 పడకలతో పాటు మూడు రకాల విభాగాలు ఉండాల్సి ఉంటుంది.

దోచుకుంటున్నారు..

జిల్లా కేంద్రంలోని ఉండే ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారారు. అందరూ కలిపి ఒక ధరలు నిర్ణయించుకొని ఆ ప్రకారం వసూలు చేస్తున్నారు. సాధారణంగా చెస్ట్‌ సీటీ స్కాన్‌ చేయడానికి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు తీసుకుంటే ఎంఆర్‌ఐ బ్రెయిన్‌లో పలు రకాల స్కానింగ్‌కు రూ.5,000నుంచి రూ.8,000 వరకు తీసుకుంటున్నారు. ఇక డెంగీ, మలేరియా, వైడల్‌, సీబీపీ, ఆర్‌ఎఫ్‌టీ, ఎల్‌ఫ్‌టీ, లిపిడ్‌ ప్రొపైల్‌, హార్మోన్స్‌ పరీక్షలు ఇలా కొన్ని రకాల రక్త పరీక్షలకు రూ.1,500 నుంచి రూ.2500 వరకు చార్జ్‌ చేస్తున్నారు. చాలా వరకు గ్రామాల నుంచి రోగులను ఆర్‌ఎంపీ రెఫర్‌ చేస్తుండగా.. ఇందులో ఆర్‌ఎంపీలకు 40 శాతం, స్కానింగ్‌ కేంద్రాలకు 60 శాతం లెక్కన కమీషన్లు పంచుకుంటున్నారు.

తనిఖీల్లో గుర్తిస్తాం

జిల్లాలో ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా ఉన్న ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు, ల్యాబ్‌లలో తనిఖీలు నిర్వహిస్తాం. ప్రోగ్రామ్‌ అధికారులకు, మెడికల్‌ ఆఫీసర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి వారి పరిధిలో లైసెన్స్‌ లేకుండా నిర్వహించే వాటిపై నివేదిక తయారు చేయాలని చూస్తాం. తనిఖీలు చేసి సదరు నిర్వహకులకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ కృష్ణ, డీఎంహెచ్‌ఓ

పీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ..

స్పత్రుల నిర్వహణ, పీఎన్‌డీటీ(కాన్పుకు ముందు లింగ నిర్ధారణ) చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు’ బోర్డులను స్కానింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసి నిర్దిష్ట ధరల పట్టిక ప్రదర్శించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలకేంద్రాల్లో కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు వారి పేరు ముందు డాక్టర్‌ అని రాసుకొని ఏకంగా ఆస్పత్రులు తెరిచి అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను వారే ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎంపీలు మండల కేంద్రాల నుంచి పట్టణంలో ఉండే అనుమతులు లేని ఆస్పత్రులకు వైద్యం కోసం రెఫర్‌ చేసి పంపుతున్నారు. ఇందులో నిర్వాహకులు పీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఊరూ పేరు లేని వైద్యుల సిఫార్సుతో గర్భిణీలకు స్కానింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు సొంతంగానే గర్భిణీలకు స్కానింగ్‌లు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్కానింగ్‌ కేంద్రాలు, ల్యాబ్‌ల్లో ఇష్టారాజ్యంగా ధరలు

అర్హులు లేకపోయినా వైద్యచికిత్సలు

క్షేత్రస్థాయిలో అర్హత లేని, అనుమతి లేనికేంద్రాలు ఎన్నో..

తనిఖీలు మరిచిన ఆరోగ్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement