
కమనీయం.. జములమ్మ కల్యాణం
గద్వాలటౌన్: చూడముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆసీనులైన జమదగ్ని మహర్షి.. పచ్చటి తోరణాలు, మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల నడుమ మంగళవారం నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణం కనులపండువగా జరిగింది. సాంప్రదాయబద్దంగా దేవతామూర్తులను పూజించి పుణ్యాహవాచనం నిర్వహించి కన్యాదానం కొనసాగించారు. అంతకుముందు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో జములమ్మ అమ్మవారిని, వరుడిగా త్రిశూలాన్ని ఊరేగింపుగా పెళ్లిపీటలపైకి తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి యోక్త్రధారణ, త్రిశూలానికి యజ్ఞోపవిత ధారణ, సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మధ్యాహ్నం 12.15కి మాంగళ్యధారణ నయనానందంగా సాగింది. కల్యాణోత్సవానికి ముందు పలువురు దంపతులు సంకల్పం నిర్వహించారు.
● ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వేర్వేరుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించించారు. ఎమ్మెల్యే అమ్మవారికి నిత్య విశేష పుష్పాలంకారం చేసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జములమ్మ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జములమ్మ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో చల్లంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పండితుల నుంచి ఇరువురు ఆశీస్సులు పొందారు. జములమ్మ కల్యాణంతో నడిగడ్డ సుభిక్షంగా వర్ధిల్లుతుందని పండితులు పేర్కొన్నారు. వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధు లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యా ణ మహోత్సవంలో ఈఓ పురేంధర్ కుమార్, అల య కమిటీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ చైర్మన్ సతీష్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్

కమనీయం.. జములమ్మ కల్యాణం