
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
భూత్పూర్: ఊరికి దూరంగా ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8 ఆలయాల్లో జరిగిన చోరీల్లో అతని ప్రమేయం ఉంది. ఈమేరకు మంగళవారం మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జూలై 31న సీసీకుంట గంగాభవాని ఆలయంలోని గర్భగుడి తాళం విరగ్గొట్టి వెండి ఆభరణాలు దొంగతనం చేయగా.. ఆగస్టు 1న కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈక్రమంలో మంగళవారం సీసీకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన తోక కర్ణాకర్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఆలయ చోరీ సమయంలో సీసీ ఫుటేజీలో కనిపించిన అనుమానితుడిని.. ఇతడిని పోల్చి చూడగా ఒక్కరేనని గుర్తించారు. అదుపులోకి తీసుకొని ఆరా తీయగా గంగాభవాని ఆలయంలో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. 2024 జనవరి 24 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలిస్తూ వచ్చాడు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 8 ఆలయాల్లో జరిగిన దొంగతనాల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఇందులో సీసీకుంట మండలం మద్దూర్, పెద్దమందడి మండలం మద్దిగట్ల, వెల్టూర్, జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి, ఇటిక్యాల మండలం షాబాద్, సాతర్ల, పెబ్బేర్ మండలం వైశాఖాపూర్, కొత్తకోట మండలం చర్లపల్లి, మదనాపూర్ మండలం అజ్జకొల్లు, వనపర్తి పట్టణంలో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి రూ.3,96,200 నగదు, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఆలయంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీసీకుంట ఎస్‌ఐ రామ్‌లాల్, నిరంజన్‌రెడ్డి, విష్ణు, బాల్‌రెడ్డి, రవిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 8 ఆలయాల్లో వెండి ఆభరణాల అపహరణ