Telangana Crime News: రెండు స్కూల్‌ బస్సులు ఢీ
Sakshi News home page

రెండు స్కూల్‌ బస్సులు ఢీ

Jan 2 2024 12:56 AM | Updated on Jan 2 2024 11:45 AM

ఆస్పత్రిలో చేరిన గాయపడిన విద్యార్థి   - Sakshi

ఆస్పత్రిలో చేరిన గాయపడిన విద్యార్థి

జడ్చర్ల టౌన్‌ (తిమ్మాజిపేట): నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్‌ సమీపంలో సోమవారం రాత్రి రెండు స్కూల్‌ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. జడ్చర్ల మండలం నాగసాల సమీపంలో ఉన్న ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను రెండు బస్సులలో సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం దేవాలయానికి వెళ్లి అక్కడ పూజలు ముగిశాక పాఠశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు.

స్కూల్‌ బస్సులు రెండు ఒకదాని వెంట మరోటి ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో మరికల్‌ సమీపంలో ఎదురుగా ఉన్న కారును తప్పించేందుకు ముందు వెళ్తున్న బస్సు సడన్‌ బ్రేక్‌ వేయటంతో వెనకాలే వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులకు ఏం జరిగిందో తెలియక కేకలు పెట్టారు. రెండు రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ముందు సీట్లకు గుద్దుకున్నారు.

కొందరు విద్యార్థులకు మూగదెబ్బలు తగలగా నిఖిల్‌, భాను, చైతన్య, జానకిరాం, విద్వాన్‌, సాయితేజలకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రైవేట్‌ వాహనాల్లో జడ్చర్ల పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సుల వెనకాల మరో వాహనం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. భారీ వాహనం వచ్చిఉంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. ఘటనా స్థలానికి స్కూల్‌ ప్రతినిధులు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకువెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement