● జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత
● 11 యూనిట్లలో కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి
● శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు
జూరాల ప్రాజెక్టు ముందు సెల్ఫీ దిగుతున్న పర్యాటకులు
జూరాల సమాంతర కాల్వకు జలకళ
గద్వాల/ఆత్మకూరు/అమరచింత/ధరూర్/ఎర్రవల్లి/కొల్లాపూర్ రూరల్: ఎగువప్రాంతంలో భారీ వర్షాలు కురస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 90,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 12 క్రస్టు గేట్లను ఎత్తి 39,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లలో 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 7.704 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని వారంలోగా సమస్యను పరిష్కరించి పూర్తిస్తాయిలో ఉత్పత్తి చేపడుతామని అధికారులు వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం 38,712 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. అలాగే నెట్టెంపాడు కాల్వకు 750 క్యూసెక్కులు, భీమా–1కు 1,300 క్యూసెక్కులు, భీమా–2కు 750 క్యూసెక్కులు కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 870 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 89,487 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
– ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తుండంతో జలకళను సంతరించుకుంది. ఈ సీజన్‌లో మొదటిసారి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పర్యాటకులు తరలివచ్చారు. కృష్ణమ్మ జల సవ్వడులను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా కలిపి దాదాపు 80వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండడంతో బీచుపల్లి, సోమశిల వద్ద కృష్ణానది పరుగులు పెడుతోంది. సోమశిలకు అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం సమీపానికి వరద నీరు వచ్చింది. వేపలింగం పరిసరాలు మునిగి పోయాయి. ప్రస్తుతం నదిలోకి ఎవరూ వెళ్లవద్దని బోటు యజమానులకు అధికారులు సూచించారు.
సోమశిల దగ్గర కృష్ణానదికి వస్తున్న వరద
నీటితో కళకళలాడుతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ


