పాముకాటుకు విద్యార్థి బలి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుకు విద్యార్థి బలి

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

అయిజ: పాముకాటుకు గురై విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామ స్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప, జయలక్ష్మి దంపతుల కుమారుడు తిరుమలేష్‌ (14) శాంతినగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలో పాము కాటువేసింది. గుర్తించిన తల్లిదండ్రులు పామును చంపి, బాలుడిని తనగలకు తీసుకెళ్లి, నాటువైద్యం చేయించారు. పరిస్థితి మెరుగుపడక పోవడంతో అక్కడి నుంచి అయిజ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పీహెచ్‌సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి గద్వాలకు రెఫర్‌ చేశారు. వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహానికి కర్నూలు ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడు సజీవ దహనం

మరికల్‌: కర్నూల్‌ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘట న చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు.. మరికల్‌ మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్‌ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్‌ జాడోనాయక్‌, రవినాయక్‌ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్‌ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్‌ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్‌, రవినాయక్‌ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్‌ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్‌ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం

అచ్చంపేట రూరల్‌: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సిద్దాపూర్‌ ఎస్‌ఐ అంజయ్య వివరాల ప్రకారం... బొమ్మనపల్లికి చెందిన జల్లెల మహేశ్‌తో ఐదేళ్ల క్రితం పదర గ్రామానికి చెందిన మంజుల (25)కు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. గురువారం ఉదయం తన అత్త లక్ష్మమ్మతో కుటుంబ విషయాలపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మంజుల.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి పెద్దలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement