మహబూబ్‌నగర్ రూరల్/ హన్వాడ: జిల్లాలోని హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వరి ధాన్యం బస్తాల వ్యత్యాసం వ్యవహారం జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య రూ.11.34 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన వ్యత్యాసం గుర్తించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ విచారణను వేగవంతం చేసింది. సాంకేతిక లోపమా, నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. 2022–23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన 5,070.88 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ. 5 కోట్లకు పైగా ఇప్పటికే చెల్లించినట్లు, ఆన్‌లైన్ చెల్లింపుల రికార్డులు, ఇన్సాయిస్‌లు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే పౌర సరఫరాల శాఖ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన రిలీజింగ్ ఆర్డర్ (ఆర్‌ఓ) తీసుకోకుండానే నిల్వలను తరలించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసం ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ప్రసాద్‌లాల్ జిల్లాలో పర్యటించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, మిల్లుల నిర్వహణ, నిబంధనల అమలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ మాట్లాడుతూ విజిలెన్స్ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని, జిల్లా మేనేజర్ నివేదిక, విజిలెన్స్ నివేదికలు అందిన తర్వాత శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణలో భాగంగా ధాన్యం చెల్లింపులు, ఆర్‌ఓ జారీ ప్రక్రియ, నిల్వల కదలికలు, ప్రభుత్వ రికార్డులు, మిల్లు నిర్వహణకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తుది నివేదికలో తేలే అంశాల ఆధారంగా శాఖాపరమైన, చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆర్‌ఓ అంటే ఏమిటి?
రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ఽధాన్యాన్ని మిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత, సంబంధిత నిల్వలను తరలించేందుకు పౌర సరఫరాల శాఖ నుంచి రిలీజింగ్ ఆర్డర్ తప్పనిసరిగా జారీ కావాలి. ఈ ఉత్తర్వు వచ్చిన తర్వాతే ఽధాన్యం లేదా బియ్యాన్ని నిర్ణీత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఆర్‌ఓ లేకుండా నిల్వలను తరలిస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ప్రస్తుతం శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కేసులో కూడా ఇదే అంశం ప్రధానంగా విచారణలో ఉంది. ఇది కేవలం సాంకేతిక ఉల్లంఘన మాత్రమేనా? లేక మరేదైనా అక్రమం జరిగిందా ? అనే విషయాన్ని అధికారులు తేల్చనున్నారు.
రూ. 11.34 కోట్ల విలువైన నిల్వల తేడాపై లోతైన పరిశీలన
విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ
వేర్వేరుగా దర్యాప్తు
నివేదికల తర్వాతే చర్యలు


