అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వాహనాల పార్కింగ్ రుసుం వసూలు, టెంకాయలు, పూజా సామగ్రి విక్రయానికి సంబంధించి గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. వాహనాల పార్కింగ్ రుసుం వసూలుకు సంబంధించి ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా.. ఈఓ రంగారావు పర్యవేక్షణలో వేలం నిర్వహించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. వేలంలో హైదరాబాద్‌కు చెందిన బి.సురేశ్‌కుమార్ అందరి కంటే ఎక్కువ కోడ్ చేసి రూ. 79.25లక్షలకు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. గతం కంటే రూ. 9.25 లక్షల ఆదాయం అదనంగా సమకూరినట్లు తెలిపారు. అదే విధంగా టెంకాయలు, పూజా సామగ్రి విక్రయం, చీరల నిర్వహణకు సంబంధించి గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. రెండు టెండర్లకు త్వరలోనే వేలం నిర్వహిస్తామన్నారు. కాగా, గతంలో అలంపూర్ ఆలయాల్లోనే వేలం నిర్వహించే వారు. అయితే గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో 6 సార్లు వాయిదా పడ్డాయి. దీంతో నిబంధనల మేరకు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాల యంలో వేలం నిర్వహించినట్లు ఈఓ తెలిపారు.


