కృష్ణగిరి: మండల పరిధిలోని పుట్లూరు గ్రామంలో శ్రీమాతా మారెమ్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన అంతర్ రాష్ట్రస్థాయి న్యూ కేటగిరీ వృషభాల బండలాగుడు పోటీల్లో తెలంగాణ రాష్ట్రం, జోగుళాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, గోర్లకాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కురువ కర్రెప్ప వృషబాలు నిర్ణీత సమయంలో బండను 4,987 అడుగుల దూరం లాగి విజేతగా నిలిచాయి. ఈ పోటీల్లో మొత్తం 12 జతల వృషభాలు పాల్గొనగా నంద్యాల జిల్లా, బేతంచర్లకు చెందిన మేకల భానుజా వృషబాలు (4,440 అడుగులు), నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, పీఆర్ పల్లె నాగేశ్వరయాదవ్ వృషభాలు (4,328 అడుగులు), అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలం, లక్షుంపల్లె శివారెడ్డి, నంద్యాల జిల్లా డోన్ మండలం, ఉంగరానిగుండ్లకు చెందిన పెద్ద మద్దిలేటి వృషభాలు ఉమ్మడిగా (4,262 అడుగులు), కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం, పెద్దనేలటూరు చాకలి నరసమ్మ వృషభాలు (4,257 అడుగులు) లాగి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విజేత వృషభాల యజమానులకు దాతలు స్వర్గీయ చెరుకులపాడు కంగాటి లక్ష్మినారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఆయన సోదరులు కంగాటి ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి తరఫున ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను అందజేశారు. అలాగే 2027లో జరిగే మాతా మారెమ్మ బ్రహోత్సవాల్లో ఇదే కేటగిరికీ చెందిన అన్ని బహుమతులను నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నారాయణరెడ్డి సోదరులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి అందిస్తామని ప్రకటించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
నేడు సీనియర్ విభాగంలో...
శుక్రవారం సీనియర్ విభాగంలో అంతర్ రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వృషభాల యజమానులు రూ.వెయ్యి ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు కేఈ మాదన్న, కేఈ లక్ష్మన్న జ్ఞాపకార్థం ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ సహకారంతో వరుసగా రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పేర్ల నమోదుకు 75693 90793, 89851 25199 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.


