● పోలీసుల అదుపులో గ్రామ, వార్డు
సచివాలయాల ఉద్యోగులు
● ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఆదోని: సమస్యల పరిష్కారం కోసం శనివారం రాత్రి విజయవాడకు వెళ్లిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోనే పోలీసులు నిర్బంధించారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదోని డివిజన్ నుండి దాదాపు 300 మంది ఉద్యోగులు శనివారం రాత్రి విజయవాడకు వెళ్లారు. వారిలో ఆదోనికి చెందిన వారు 60 మంది వరకు ఉన్నారు. వారిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకుని ఆదోని సచివాలయాల సంఘం అధ్యక్షుడు వెంకప్ప, జనరల్ సెక్రటరీ వీరేష్, ట్రెజరర్ ప్రభాకర్ తదితరులు ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడ ఉక్కుపాదం మోపడంతో వీరంతా అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం. చిక్కుకుపోయిన వారిలో కొందరు పోలీసుల వలయం దాటుకుని అష్టకష్టాలతో బయటపడ్డారు. ఆదోని సచివాలయాల నాయకుడు వెంకప్పతో పాటు మరి కొందరిని పోలీసులు పట్టుకెళ్లి విజయవాడ చుట్టుపక్కల ఉన్న పోలీసు స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారు. వారిని ఏ స్టేషన్‌కు తరలించారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదోనికి చెందిన ఉద్యోగులను నందిగామ, ఉయ్యూరు, పటమట, మాచారం, ఇబ్రహీంపట్నం, తదితర పోలీసుస్టేషన్‌లలో ఉంచారు. ఇదిలా ఉండగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ ఆయా ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.


