1న మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

1న మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

కర్నూలు(సెంట్రల్‌): బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ..సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది అక్టోబర్‌ ఒకటో తేది ఉదయం బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకోవాలన్నారు. అదే రోజు మధ్నాహ్నం నుంచి ఇంటింటికి తిరిగి పింఛన్లను పంపిణీ చేయాలన్నారు. ఈ మార్పును జిల్లాలోని పింఛను లబ్ధిదారులు గమనించాలని ఆమె కోరారు.

శనగ విత్తనాల ధరలు ఖరారు

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీ సీజన్‌కు సంబంధించి జేజీ–11 రకం పప్పు శనగ ధరలను ఖరారు చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కిలో పూర్తి ధర రూ.90 ఉండగా.. సబ్సిడీ 35 శాతం ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు సబ్సిడీ పోను కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయ పంటలు, రబీ సీజన్‌కు కర్నూలు జిల్లాకు 25వేల క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 17వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. అదనంగా శనగ విత్తనాలు కేటాయించాలని కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ బుట్టదాఖలయ్యాయి.

పొడి చెత్తకు ప్రోత్సాహక బహుమతులు

కర్నూలు(అర్బన్‌): గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో భాగంగా ఇళ్ల నుంచి పొడి చెత్తను అందించే వారికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘దసరా ధమాకా–స్వచ్చ రథం’ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమైన ఈ డ్రైవ్‌ అక్టోబర్‌ 24వ తేది వరకు కొనసాగుతుందన్నారు. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పొడి చెత్తను గ్రామ పంచాయతీ స్వచ్ఛ రథానికి విక్రయిస్తే సాధారణ ధరపై అదనంగా 10 శాతం నగదు చెల్లిస్తామన్నారు. అలాగే ప్రత్యేక డ్రైవ్‌ రోజుల్లో స్వచ్ఛ రథానికి వస్తువులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక కూపన్‌ అందిస్తామన్నారు. గ్రామ పంచాయతీ వారీగా లక్కీ డిప్‌ నిర్వహించి విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల రోజుల్లో ఎక్కువ మొత్తంలో పొడి చెత్త/వస్తువులు ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతులు ఉంటాయన్నారు.

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం నుంచి పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

అహోబిలంలో

పౌర్ణమి పూజలు

ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం మూలమూర్తులకు నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ధూపదీపాలతో మహామంగళహారతి ఇచ్చి నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement