మంత్రాలయం: హమాలీగా పనిచేసే తండ్రి రంగోళి ప్రాణేష్ అనారోగ్యంతో ఇంటికే పరిమితయ్యారు. తల్లి దేవమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ కష్టాన్ని చూసి రెండో కూతురు అంజలి చలించిపోయారు. మంత్రాలయం నుంచి తుంగభద్ర రైల్వే స్టేషన్, కర్ణాటకలోని బిచ్చాలయ, పంచముఖి క్షేత్రాలకు ఆటోను నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచారు. ఆటో కొనుగోలు కోసం రుణాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరగలేదు. కష్టాలు వచ్చినా బెదర కూడదని, నిలబడి ఉండాలని తలిదండ్రులు నేర్పిన పాఠం అంజలిని నడిపిస్తోంది. కూలికి వెళ్లి దాచుకున్న కొంత మొత్తంతోపాటు చినమ్మ, వరుసకు అన్నదమ్ముల వద్ద డబ్బులు తీసుకుని ఆటోను కొనుగోలు చేశారు. ఆటో నడిపి కూడబెట్టిన డబ్బును తన అక్క ఐశ్వర్య, చెల్లి సింధూ పెళ్లిళ్లకు ఖర్చు చేశారు. అంతేగాక తాత నుంచి వచ్చిన సెంటున్నర స్థలంలో పెద్ద గోతిని గరుసుతో రూ.50 వేలు ఖర్చుపెట్టి పూడ్చించారు. ఇంటి ఖర్చులు చూసుకుంటూ అర్ధ ఎకరం పొలంలో పంటల సాగు కూడా సాయం చేస్తున్నారు. పెళ్లిళ్లకు రూ.8 లక్షల వరకు అప్పు చేశానని, అప్పు తీర్చే బాధ్యత కూడా తనపై ఉందని అంజలి తెలిపారు. తన ఆఖరి చెల్లెలకు పెళ్లి చేసే వరకు ఇదే కష్టం చేస్తానని తెలిపారు. అమ్మానాన్నకు అండగా ఉంటానని, ఎవరైనా దాతలు సహకరిస్తే ఆటోపై తెచ్చుకున్న అప్పును (అంజలి సెల్ నంబర్: 9035155664)తీరుస్తానని చెప్పారు.
ఆటో నడుపుతున్న అంజలి


