కష్టాల్లో ‘పవిత్ర’ విజయం | - | Sakshi
Sakshi News home page

కష్టాల్లో ‘పవిత్ర’ విజయం

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

నందవరం: తండ్రి లేడు, తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పట్టుదలతో నందవరం మండల కేంద్రానికి చెందిన పవిత్ర శ్రద్ధగా చదివి డాక్టర్‌ అవుతున్నారు. పేదలకు వైద్యం అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. పవిత్రకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి జెంబు బసవరాజు గౌడ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. అమ్మ జెంబు సరితమ్మ కష్టాన్ని చూసిన పవిత్ర బాగా చదువు కోవాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మిగనూరులో ఇంటర్మీడియట్‌ విద్యను పూర్తి చేసి నీట్‌లో 198 ర్యాంకు సాధించారు. కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. పీజీ నేషనల్‌ నీట్‌–2026 ఆల్‌ ఇండియా స్థాయిలో 478 ర్యాంకు, కర్నూలు జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. అమ్మ కోరిక మేరకు ర్యాంకు సాధించానని, పేదలకు సేవలందించేందుకు కర్నూలు మెడికల్‌ కళాశాలలో జనరల్‌ మెడిసిన్‌(ఎండీ) చేస్తానని పవిత్ర తెలిపారు.

అమ్మానాన్నలే దైవం

బనగానపల్లె: అమ్మనాన్నలు తమకు దైవంతో సమానమని బనగానపల్లెలోని పెండేకంటి నగర్‌కు చెందిన డాక్టర్‌ తేజస్వి, డాక్టర్‌ సాయిఅనిలా పేర్కొన్నారు. తమది వ్యవసాయ కుటుంబమని, తండ్రి ఎన్‌ రామ్మోహన్‌రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడుతూ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విజయం సాధించారని చెప్పారు. తల్లి లక్ష్మీదేవి గృహిణిగా ఉంటూ తమ విజయానికి కృషి చేశా రని పేర్కొన్నారు. తామిద్దరం కర్నూలు మెడికల్‌ కళాశాలలోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్ల చెప్పా రు. తాను పీజీ జనరల్‌ మెడిసిన్‌ కూడా ఇక్కడే పూర్తి చేసినట్లు తేజస్వి తెలిపారు. తాను ఇటీవలే నీట్‌ పీజీలో జాతీయస్థాయిలో 1,537వ ర్యాంకు సాధించినట్లు సాయిఅనిలా చెప్పారు. తాము ఈ స్థాయికి వచ్చేందుకు తల్లిదండ్రుల కష్టం చెప్పలేనిదన్నారు. వారికి ఏ కష్టం రాకుండా సొంత పిల్లలుగా చూసుకుంటామని స్పష్టం చేశారు.

ఆత్మస్థైర్యమే నడిపించింది!

కుమార్తె ఆరు నెలల వయస్సులో ఉన్నప్పుడే పోలియో మహమ్మారి సోకడంతో తల్లిదండ్రలు బాధపడలేదు. కుమార్తెలో ఆత్మస్థైర్యం నింపి డాక్టర్‌గా తయారు చేశారు. కర్నూలు నగరానికి చెందిన జయరాజ్‌ దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో చిట్టచివరి సంతానమైన గ్రేస్‌ సెలెస్టియల్‌ ఎదుగుదలకు అంగవైకల్యం అడ్డుకాకూడని ఆమెకు ఉగ్గుపాల నుంచి ఆత్మస్థైర్యాన్ని నింపారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని బిడ్డకు ధైర్యం చెప్పారు. ఆత్మవిశ్వాసంతో కుమార్తె ఆయూష్‌ వైద్యాధికారిణిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో ఆమె అందించిన వైద్యసేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ వైద్యాధికారిణిగా అవార్డు అందజేసింది. ప్రసుత్తం దివ్యాంగుల ఉద్యోగుల రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement