ఏటా పెరుగుతున్న మరణాలు | - | Sakshi
Sakshi News home page

ఏటా పెరుగుతున్న మరణాలు

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

రెండేళ్లుగా పెద్దాసుపత్రిలో

మరణాలు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల

ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగుల్లో మరణించే వారి శాతం ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి అత్యవసర వైద్యపరిస్థితులైన ఆత్మహత్యాయత్నాలు, హత్యాయత్నాలు, దాడులు, వివిధ రకాల ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం, ఆయాసం, మూత్రపిండాల వ్యాధులతో చికిత్స కోసం వస్తుంటారు. ఇలాంటి వారిలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే క్యాజువాలిటీ, ఏఎంసీ విభాగాల నుంచి బయట పడి డిశ్చార్జ్‌ అవుతున్నారు. మొత్తంగా ఆసుపత్రిలో గత యేడాది రోజూ మరణాల సంఖ్య 15 నుంచి 18 దాకా ఉండగా ఈ యేడాది అది 18 నుంచి 22కు పెరిగింది.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగర నడిబొడ్డున ఉన్న పెద్దాసుపత్రికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే గాక అనంతపురం, వైఎస్సార్‌ కడప, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధికంగా చికిత్స కోసం వస్తారు. ఈ మేరకు ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో ఇతర ప్రాంతాల మాదిరిగా డబ్బు రొటేషన్‌ ఉండదు. అందుకే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకే రోగులు చికిత్స కోసం వెళతారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోతే సమీపంలోని ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తారు. వ్యాధి తగ్గకపోతే ఎక్కువ శాతం కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే వస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యపరీక్షలు, వైద్యులు, సిబ్బంది చికిత్స అంతా ఉచితం కాబట్టి. ఇవే పరీక్షలు, చికిత్సలు బయట చేయించుకునే స్థోమత లేక వారు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ మేరకు ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 3 వేల నుంచి 3,500ల దాకా, ఇన్‌పేషంట్ల సంఖ్య నిత్యం 1300 నుంచి 1500ల దాకా ఉంటోంది. క్యాజువాలిటీ, జనరల్‌ మెడిసిన్‌, గైనిక్‌, పీడియాట్రిక్‌ వంటి విభాగాల్లో అయితే ఒక్కో పడకపై ఇద్దరు రోగులు చికిత్స తీసుకునే పరిస్థితి ఉంటుంది.

అత్యవసరమైతే అంతే గతి!

ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దగా రద్దీ ఉండదు. ఆ తర్వాత ఓపీ చికిత్స దాదాపుగా ముగిసిపోతుంది. దీంతో ఓపీ చికిత్సకు వచ్చిన రోగులు ఇక్కడికే వస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. అందుకే ఏదైనా అత్యవసర చికిత్స వస్తే రోగులు నేరుగా ఇక్కడికే వస్తారు. ఇలా వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ఆ సమయంలో ఇక్కడ జూనియర్‌ వైద్యులు మినహా పెద్ద డాక్టర్లు ఎవ్వరూ కనిపించరు. జూనియర్‌ వైద్యుల్లోనూ కొందరు వారి జూనియర్లపై భారం వేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విభాగంలో నర్సింగ్‌ సిబ్బందే ఎక్కువగా రోగుల పక్కన సేవలందిస్తూ కనిపిస్తారు. ఇక రాత్రివేళల్లో ఇక్కడి సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు అనే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన డ్యూటీ డాక్టర్‌ సాయంత్రం వస్తారు. వచ్చిన కొన్ని గంటలు మాత్రమే ఉండి, రాత్రి భోజనానికి అంటూ వెళ్లిపోయి మళ్లీ రారన్న విమర్శలు ఉన్నాయి. రోగులకు అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే డ్యూటీ డాక్టర్లకు జూనియర్‌ వైద్యులు ఫోన్‌ చేసి వివరాలు చెప్పి చికిత్స అందించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మరునాడు ఉదయం వచ్చే డ్యూటీ డాక్టర్లు రాత్రి ఉండే ఓపీ టికెట్లను పరిశీలించి వార్డుల్లో అడ్మిట్‌ చేసే కేసులు అధికంగా ఉంటున్నాయి. అప్పటి వరకు రోగులు ఇక్కడే ఉండి చికిత్స అందుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న అక్యూట్‌ మెడికల్‌ కేర్‌(ఏఎంసీ)కు రోగి వెళితే అలాగే పైకి వెళతారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలోనూ ఎక్కువగా జూనియర్‌ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిపైనే వైద్యసేవలు ఆధారపడి ఉంది. వీరిలో కొందరికి రోగులకు అమర్చిన మానిటర్లు, వెంటిలేటర్లు సైతం సరిగ్గా చూడటం రాదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్లు మొక్కుబడిగా వైద్యం చేసి వెళ్లిపోతూ జూనియర్‌లపై భారం వేస్తున్నారు. దీనికితో ఈ విభాగంలో వైద్యపరికరాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, వాటిలో రోగికి అవసరమైన ఆక్సిజన్‌ ఎంత మేరకు వెళ్తుందన్న పర్యవేక్షణ కూడా కరువైంది. ఇన్‌ఫెక్షన్‌ రేటు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కర్నూలు పెద్దాసుపత్రి... పెద్ద డాక్టర్లుంటారని, ఇక్కడికి వెళ్తే రోగాలు నయం అవుతాయని, బతికి బయటపడొచ్చని రోగుల నమ్మకం. ఇది ఒకప్పటి మాట. నేడు ఈ ఆసుపత్రికి వెళితే తిరిగి ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆసుపత్రిలోని పై అంతస్తులో ఉన్న ఏఎంసీ విభాగంలో చేరిన వారు 80 శాతానికి పైగా మరణిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పెద్దాసుపత్రిలో మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోంది.

గతేడాది నెలకు 500కు పైగా

మరణాలు

ఈ యేడాది 600లకు చేరువగా!

క్యాజువాలిటీ, ఏఎంసీల్లోనే ఎక్కువ

అందుబాటులో ఉండని డాక్టర్లు

సిబ్బంది నిర్లక్ష్యం మరీ దారుణం

పేరుకే ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగం

ఆసుపత్రిలోని క్యాజువాలిగా(అత్యవసర చికిత్స విభాగం)ని గత ప్రభుత్వంలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగంగా మార్చారు. ఈ మేరకు ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను కేటాయించారు. క్యాజువాలిటీకి బోర్డులో ఎమర్జెన్సీ మెడిసిన్‌ అని పేరు మాత్రమే మార్చారు. సేవలన్నీ పాత క్యాజువాలిటీ మాదిరిగానే కొనసాగుతున్నాయి. అత్యవసర వైద్యసేవలు ఇక్కడ మొక్కుబడిగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వారికి అందే వైద్యం దైవాధీనం అన్న చందంగా సాగుతోంది. సీనియర్‌ వైద్యులు, నర్సులు సీట్లను వదిలి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం వైద్యసేవలను జూనియర్లపై వదిలేసి రికార్డులు రాసుకోవడానికే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ విభాగంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి.

నెల 2025 2026

జనవరి 539 631

ఫిబ్రవరి 552 626

మార్చి 466 661

ఏప్రిల్‌ 544 550

మే 561 655

జూన్‌ 547 608

జులై 582 549

ఆగస్టు 519 590

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement