ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు | - | Sakshi
Sakshi News home page

ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

మద్దికెర: ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇంట్లో ఫ్యాన్‌ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో అనధికార విద్యుత్‌ కోతలు ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గంటల తరబడి ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. దీంతో సామాన్యులు నిద్ర లేక అల్లాడిపోతున్నారు. విద్యుత్‌ అధికారులను అడిగితే తమకు షెడ్యూల్‌ ఇవ్వకుండా మొయిన్‌ సప్‌లై పోయిందంటున్నారు. గాలిమరలు, సోలార్‌ పవర్‌ ఉంది కదా అని ప్రశ్న వేస్తే ఏమీ సమాధానం ఇవ్వడం లేదు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వానాకాలంలో భగ్గుమంటున్న ఎండలు

కర్నూలు (అగ్రికల్చర్‌): వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఏప్రిల్‌, మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు సెప్టెంబర్‌లో నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంది. కానీ ఆదివారం కర్నూలులో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 38, 39 డిగ్రీలు కూడా నమోదయినట్లు తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే లక్ష హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చింది. తాజా ఉష్ణోగ్రతల తీవ్రతకు పంటలపై రైతులు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

క్వింటా వేరుశనగ రూ.9,040

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.9,040 ధర లభించింది. మార్కెట్‌కు 861 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.6,100, మధ్యస్థంగా రూ.7,669 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement