కోసిగి/మంత్రాలయం: శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం నేడు అత్యంత వైభవంగా జరుగనుంది. వేకువజామన ఉరుకుంద క్షేత్రంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా బయలుదేరి తిప్పలదొడ్డి, కామన్‌దొడ్డి, కందుకూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ దింపుడు కట్టపై స్వామి వారు ఆశీనులు కానున్నారు. తుంగభద్ర నదిలో చక్రస్నానం నిర్వహించి వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు, కామన్‌దొడ్డి, తిప్పలదొడ్డి మీదుగా ఉరుకుంద ఈరన్న క్షేత్రానికి సాయంకాలానికి పల్లకోత్సవం పాదయాత్ర చేరుకుంటుంది. పల్లకోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వే లాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కోసిగి, కౌతాళం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయించారు.
నదితీరంలో గ్రావెల్‌తో ర్యాంపు ఏర్పాటు
పల్లకోత్సవం యాత్ర సందర్భంగా కందుకూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పి.మురళీమోహన్ రెడ్డి సహకారంతో గ్రావెల్ ర్యాంపు, రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెట్టన గౌడ, గ్రామస్తులు తాయన్న, రామన్న, శివరాం, శేఖర్ గౌడ తెలిపారు. రామలింగేశ్వర ఆలయం నుంచి నది ఒడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను జేసీబీతో తొలగించారు.అలాగే నదిలో నీరు తక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతానికి వెళ్లేందుకు కంకర రాళ్లు, గ్రావెల్ వేసి మార్గం ఏర్పాటు చేయించారు.
ఊరూరా సంబరాలు
ఈరన్న స్వామి రాకతో ఆయా గ్రామాల్లో పండగ జరుపుకుంటారు. పిండి వంటలతో స్వామికి నైవేద్యాలు, నారీ కేళాలు సమర్పిస్తారు. కందుకూరు గ్రామంలో జాతర చేసుకుని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉరుకుంద గ్రామంలోనూ ఇదే విధంగా వేడుక చేసుకుంటారు. ఊరూరా భక్తులు పల్లకీ ముందు బోర్లాపడి తమ శరీరాలపై పల్లకీ దాటుకుని వెళ్లేలా చూసుకుంటారు. ఈ వేడుక శ్రావణ మాసోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


