క‘రుణ’ లేక.. కష్టాలు తొలగక! | - | Sakshi
Sakshi News home page

క‘రుణ’ లేక.. కష్టాలు తొలగక!

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

కర్నూలు (అగ్రికల్చర్‌): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులు రైతులకు పంట రుణాలు పంపిణీ చేస్తాయి. దాదాపు ఆరు నెలలు అవుతున్నా.. పంట రుణాల పంపిణీ అంతంతమాత్రానికే పరిమితం అయ్యింది. ఐదు నెలల వ్యవధిలో 61.17 శాతం మాత్రమే పంట రుణాలు పంపిణీ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ఈ నెల చివరితో ముగియనుండగా బ్యాంకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

పంపిణీ చేసింది

రూ.2,543 కోట్లు

ఖరీఫ్‌ సీజన్‌ సాధారణ సాగు 4.34 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3,48,390 హెక్టార్లలో పంటలు వేశా రు. ప్రధానంగా పత్తి 2,33,984 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్‌లో 3,98,647 మంది రైతులకు రూ.4,157.40 కోట్లు పంట రుణాల పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,42,770 మంది రైతులకు రూ.2,542.24 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. జిల్లా లో కెనరా బ్యాంకు లీడ్‌ బ్యాంకుగా వ్యవహరిస్తోంది. మొత్తం 85,617 మంది రైతులకు రూ.1490 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే 31 వేల మందికి రూ.702 కోట్లు మాత్రమే పంటరుణాలు పంపిణీ చేశారు.

బ్యాంకుల నిర్లక్ష్యం!

రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబరు నెల చివరిలో ముగియనుంది. అక్టోబరు 1 నుంచే పంపిణీ చేసే రుణాలు రబీ కిందకు వస్తాయి. ఖరీఫ్‌ ముగింపు దశకు చేరినప్పటికీ 61.17 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. పలు బ్యాంకులు పాత రుణాలను రెన్యువల్‌ చేసి చేతులు దులుపుకున్నాయి. కొత్తగా ఒక శాతం మందికి కూడా పంట రుణాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వివిధ బ్యాంకుల్లో దళారీల హవా నడుస్తోంది. మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు దళారీలను పెట్టుకుని పంట రుణాల పంపిణీలో మా మూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి మండలాల్లోని ఎస్‌బీఐ, ఏపీజీబీ, యూనియన్‌ బ్యాంకులో దళారీలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు బ్యాంకులు సహకరించకపోవడంతో ప్రయివేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 23 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

అంతంతమాత్రమే!

వ్యవసాయ రంగం, ప్రాధాన్యత రంగం, ప్రాధాన్యేతర రంగాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.22,323 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. ఆర్థిక సంవత్పరం మొదలై దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.8,368 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే 37.49 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో రు ణాల పంపిణీ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది పంట రుణాలు, అగ్రికల్చర్‌ టర్మ్‌లోను, వ్యవసాయ మౌలిక సాదుపాయాలు తదితర వాటికి రూ.10,630 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే ఆగస్టు చివరి నాటికి రూ.3857.19 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో 36.29 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఫ్రాధాన్య రంగంలోకి వచ్చే డీఆర్‌డీఏ, మెప్మాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ నామమాత్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎంఎస్‌ఎంఈ కింద ఈ ఏడాది 27933 మందికి పరిశ్రమల ఏర్పాటుకు రూ.4585 కోట్లు రుణాలుగా పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 7900 మందికి రూ.1922 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి.

కౌలురైతులను పట్టించుకుంటే ఒట్టు!

అన్నదాత సుఖీభవ పథకం రెండేళ్లుగా ఒక్క కౌలు రైతుకు కూడా అమలు కాలేదు. ఈ ఏడాది 14,000 సీసీఆర్‌సీ కార్డులు జారీ అయ్యాయి. అత్యధికంగా ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు, గూడూరు, హొళగుంద, మద్దికెర, తుగ్గలి, నందవరం మండలాల్లో సీసీఆర్‌సీ కార్డులు జారీ అయ్యాయి. సీసీకార్డులను బ్యాంకర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో కౌలుదారులకు రూ.45 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులు జేఎల్‌జీ గ్రూపులుగా ఏర్పాటు కావడంతో రూ.65 లక్షలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఏ పంటలో కూడా క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో రైతులు వాతావరణ ఆదారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై దృష్టి సారించారు. బ్యాంకుల్లో పంట రుణం ఉన్న రైతులు బ్యాంకుల ద్వారానే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అయితే బ్యాంకులు సహకరించకపోవడంతో రైతులు నాన్‌ లోని కింద ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా 1,92,884 దరఖాస్తుల ద్వారా రైతులు ప్రీమియం చెల్లించారు.

రుణాల పంపిణీలో కనిపించని పురోగతి

ఖరీఫ్‌ లక్ష్యం రూ.4,157 కోట్లు

ఆగస్టు వరకు పంపిణీ చేసింది

రూ.2,543 కోట్లు

అప్పులబాధతో 23 మంది

రైతుల ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement