● నినాదాలతో హోరెత్తించిన
న్యాయవాదులు
కర్నూలు: ‘సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ కావాలి’ అంటూ నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 14వ రోజు ఆదివారం కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని న్యాయవాదులు ప్లకార్డులను ప్రదర్శించారు. హైకోర్టు బెంచ్ కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో న్యాయవాదులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకు అన్ని పక్షాల రాజకీయ నేతలు, ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు స్పష్టం చేశారు. న్యాయవాదుల దీక్షలో సాద్విక, నిస్సీ, జి.మురళీకృష్ణ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈదుల బాలాజీ రెడ్డితో పాటు న్యాయ విద్యార్థి హేమంతేశ్వర మునిరాజు పాల్గొన్నారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున తమ విధులు బహిష్కరించి దీక్షా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, లైబ్రేరియన్ ఎండి మహేష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, కపిలేశ్వరయ్య, ఓంకార్, నాగేంద్రనాథ్, నాగలక్ష్మి దేవి, వై.జయరాజు, గోపాల్, రాజేంద్ర, శ్రీరాముడు, జూనియర్ న్యాయవాదులు గోతం శేఖర్, షేక్ అఫ్రోచ్ బాషా, మధుకుమార్ నాయుడు తదితరులు దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు తెలిపారు.


