● మంత్రి టీజీ ప్రత్యామ్నాయం
ఆలోచించాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు (టౌన్): భక్తిశ్రద్ధలతో కర్నూలులో ఎంతో వైభవంగా నిర్వహించుకునే వినాయక నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకుంటే పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు ప్రజల విశ్వాసాలతో ఆటలాడవద్దని, అధికారులతో మంత్రి టీజీ భరత్ చర్చించి ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ కర్నూలులో పెద్ద ఎత్తున వేల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రూ.10 కోట్ల వరకు అడ్వాన్సులు ఇచ్చారని, కొన్ని మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఈ దశలో మంత్రి టీజీ భరత్ ఒక అడుగు ఎత్తు ఉన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లో నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే వాటిని నిమజ్జనం చేయకుండా వచ్చే ఏడాది చేసుకోవాలని అవసరమైతే వాటిని భద్రపరుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీళ్లు లేవని తెలిసినప్పుడు నెల రోజుల ముందే ఎందుకు చెప్పలేదని, ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని ఏడాది వరకు పక్కన ఉంచితే, వచ్చే ఏడాది కూడా వర్షాలు లేకపోతే ఏం చేస్తారని మంత్రిని ప్రశ్నించారు? ప్రజల ఆధ్యాత్మి క మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. వినాయక నిమజ్జనాన్ని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారని, కర్నూలులో ముస్లింలు సైతం మసీదుల వద్ద హిందువులకు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు అందించి మతసామరస్యాన్ని కాపాడుతారన్నారు.


