పేద బలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు | - | Sakshi
Sakshi News home page

పేద బలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

కర్నూలు(హాస్పిటల్‌): రాయలసీమ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (రోపా), గుంటూరుకు చెందిన శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను పేద బలిజ మెరిట్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌)లు పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రోపా అధ్యక్ష, కార్యదర్శులు చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ, కత్వా రాష్ట్ర రాష్ట్ర నాయకులు పెద్ది లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఆయా సంఘాల కార్యవర్గ సమావేశం కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లమా, బీటెక్‌, బీ ఫార్మసి, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో 2026–27 అకడమిక్‌ సంవత్సరంలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు నూతనంగా ఫార్మ్‌–ఎ, గత యేడాది ఉపకార వేతనాలు పొందిన వారు, రెన్యువల్‌ కోసం ఫార్మ్‌–బి దరఖాస్తులు సమర్పించాలన్నారు. పదవ తరగతిలో, తదనంతర కోర్సుల్లో ప్రతి సంవత్సరం కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎంసెట్‌లో 30వేల లోపు ర్యాంకు పొంది ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్‌, ఈ యేడాది ఫీజు రశీదు, తెల్ల రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ), విద్యార్థి ఆధార్‌, బ్యాంకు ఖాతా పుస్తకం, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు జతపరచాలని తెలిపారు. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్‌, ఆత్మకూరు, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లోని రోపా నియోజకవర్గ సమన్వయకర్తల వద్ద అప్లికేషన్లు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అందించాలన్నారు. అనంతరం వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించి పదవీ విరమణ పొందిన రోపా సభ్యులను కార్యవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బీఏ శ్రీనివాసరావు, రోపా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్‌, సంఘం పెద్దలు ఐ.వెంకటేష్‌, సుబ్రహ్మణ్యం, కామిని వెంకటేశ్వర్లు, యక్కంటి శ్రీనివాసులు, జానకి శ్రీనివాసులు, మధుసూదనరావు, గద్వాల ఈరన్న, చింతల జ్యోతిర్మయి, బ్రాహ్మణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement