డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు

నంద్యాలలో రిలే నిరాహార దీక్షలు

విద్యార్థులు, నిరుద్యోగులు

తరలిరావాలని పిలుపు

నంద్యాల: టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు, స్కాంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డీఎస్సీలో అక్రమాలను నిరశిస్తూ ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నంద్యాల కేంద్రంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. టెట్‌ క్వాలిఫై కాని అభ్యర్థులకు, స్పోర్ట్స్‌ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడం దారుణమన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని స్పష్టం చేస్తూ, బాధితులైన నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్లు దేశం సుధాకర్‌ రెడ్డి, రామలింగారెడ్డి, రైతు విభాగం సెక్రటరీ రత్నబాబుచౌదరి, మహిళా విభాగం సెక్రటరీ శశికళా రెడ్డి, మాబున్నిసా, పార్టీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్‌ అజాద్‌, కారు రవికుమార్‌, టీవీ రమణ, శంకర్‌నాయక్‌, శ్రీనివాసులు, కలాం బాషా, చంద్రశేఖర్‌, కృష్ణారెడ్డి, పార్దుడు, చింపింగ్‌, బాషీద్‌, సుబ్బరాయుడు, సాదిక్‌ బాషా, డాక్టర్‌ సుబ్బారెడ్డి, గౌస్‌, సాయిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement