కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

12 మందికి గాయాలు

కోడుమూరు రూరల్‌: వ్యవసాయ కూలి పనులకు వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు.. గూడూరు మండలంలోని జూలకల్‌ గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం గుడిపాడు గ్రామంలో ఉల్లినాట్లు వేసే పనికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో జూలకల్‌ గ్రామం దాటి గూడూరు సమీపానికి వస్తున్న సమయంలో డ్రైవర్‌ ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ట్రాలీ ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూలకల్‌ గ్రామానికి చెందిన దేవమ్మ, మార్తమ్మ, రజిత, పుష్పావతి, కవితతో పాటు మరో ఏడుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు గూడూరు ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప తెలిపారు.

వాహనాల్లో పరిమితికి మించి

ప్రయాణించొద్దు

గూడూరు ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు వాహనాల్లో పరిమితికి మించి ఎక్కి ప్రయాణించరాదన్నారు. వాహనదారులు కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, కూలీలను తీసుకెళ్లే సమయంలో అతివేగం మంచిది కాదని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement